వైసీపీ ఎంపీ ఇలా బుక్కయ్యేందేంటి?

June 06, 2020

ప్రతిపక్షాల అప్రమత్తతో అనకాపల్లి వైసీపీ ఎంపీ సత్యవతి అడ్డంగా బుక్కయ్యారు. పేదల కోసం కరోనా కాలంలో వారి ఆకలి తీర్చడానికి ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని మధ్యలో కాజేశారు. ఏకంగా ఒక లోడు తమ ప్రాంగణానికి తరలించుకున్నారు. దీనిని కనిపెట్టిన ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. శవాల మీద పేలాలు ఏరుకుంటారా?.. అంటూ సర్కారును ఎండగట్టాయి.  దీంతో వైసీపీ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీ భర్తపై కేసు పెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే...

పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం లోడును ఎంపీ భర్త నడిపే వివేకానంద చారిటబుల్ ట్రస్టుకు తరలించారు. ప్రభుత్వ రేషను లారీ ఇక్కడకు ఎందుకు వచ్చింది అని స్థానికులు గుసగుసలాడుకున్నారు. మెల్లగా ఈ విషయం నలుగురికి పాకింది. దీంతో ప్రతిపక్షాలు దీనిపై గోలచేశాయి. పేదోడి కడుపుపై కొడుతారా? మరీ ఇంత దారుణమా అంటూ జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. విశాఖ జిల్లా జేసీ శివశంకర్ ఆయనపై కేసు నమోదు చేసి గొడవకు తాత్కాలికంగా కామా పెట్టారు. 

మే 3తో లాక్ డౌన్ అయిపోనున్న నేపథ్యంలో జేసీ హామీ ఇచ్చినట్టు థర్డ్ పార్టీతో విచారణ జరుపుతారా? లేదా ? చర్చమొదలైైంది. చాలా పబ్లిక్ గా జరిగిన తప్పుకావడంతో వైసీపీ తమ ఎంపీ కుటుంబం చర్యను ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. సందు దొరికితే ఉత్తినే తన బాధ్యత మరిచి ప్రతిపక్షాల మీద పడుతున్న ప్రభుత్వం జిల్లాలో ఇలా అడ్డంగా దొరికిపోయింది. ఇపుడు దీనిని ఏం చేస్తారు? కేసు పెట్టి ఎంపీ భర్త విష్ణుమూర్తిని లోపేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. అయినా... గుంటూరు జిల్లాలో పట్టపగలు హత్యాయత్నం చేసిన వ్యక్తికే స్టేషను బెయిలు ఇచ్చిన ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఏం చేస్తుందో చూడాలి.