సారీ చెప్పిన అనసూయ

July 07, 2020

వివాదాస్పద అంశాల జోలికి వెళ్లటానికి సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలు అస్సలు ఇష్టపడని పరిస్థితి తెలిసిందే. అయితే.. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇటీవల కాలంలో సామాజిక అంశాల మీద స్పందిస్తున్న తీరు అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పటి పరిస్థితితో పోలిస్తే.. ఇప్పుడు సీన్ మారిందని చెప్పక తప్పదు. అయినప్పటికీ బాలీవుడ్ తో పోలిస్తే.. ఈ స్పందించే తీరు టాలీవుడ్ లో తక్కువనే చెప్పాలి.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉరితాడుగా మారే యురేనియం తవ్వకాల అంశంపై సినీ ప్రముఖులతో పాటు.. సెలబ్రిటీలు గళం విప్పుతున్నారు. సేవ్ నల్లమల అంటూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఉద్యమంలోకి వచ్చారు ప్రముఖ నటి కమ్ యాంకర్ అనసూయ భరద్వాజ.
ఎలక్ట్రానిక్ డివైజ్ ల ద్వారా రానున్న రోజుల్లో గాలిని కొనాల్సి వస్తుందా? గాలిని కొనుక్కోగలిగిన వారికే గాలి. లేకుంటే ఊపిరి ఆడక చావాలా? అంటూ తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. సేవ్ నల్లమల అంటూ పోస్ట్ చేశారు. యురేనియం తవ్వకాలకు ఎలా అనుమతులు ఇచ్చారు సార్. ఆలోచించటానికే భయం వేయటం లేదా? అని ప్రశ్నించారు.
తన సోషల్ మీడియా నుంచి పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ను ఆమె కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్.. ఏపీ పర్యావరణ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్ తో పాటు పొరపాటున తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్నకు ట్యాగ్ చేశారు. వాస్తవానికి ఆమె ట్యాగ్ చేయాల్సింది తెలంగాణ అటవీ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి. దీంతో.. తన తప్పును తెలుసుకున్న అనసూయ.. తనకు తానే మాజీ మంత్రి జోగు రామన్నకు సారీ చెప్పారు. జోగురామన్న సార్ ను తప్పుగా ట్యాగ్ చేసినందుకు క్షమించండి.. ప్రస్తుత వ్యవహారాల మీద అవగాహన లేకనే ఇలా జరిగిందంటూ వివరణ ఇచ్చారు.