అమరావతి నుంచి సింగపూర్ అవుట్: బాబుకు నష్టమా? జగన్ కు లాభమా?

April 03, 2020

సింగపూర్ పాస్ పోర్ట్... ప్రపంచంలోనే  మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్. అది ఉన్న వారికి అత్యధిక దేశాల్లో వీసా రహిత ప్రయాణం లభ్యమవుతుంది. సింగపూర్ సిటిజన్ అంటే అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని అనేక దేశాలు భావిస్తాయి. అందుకే ... అలాంటి వ్యక్తి వల్ల తమ దేశానిక ిఏ నష్టం ఉండదు అన్న నమ్మకంతో చాలా దేశాలు సింగపూర్ సిటిజన్స్ ను ప్రత్యేకంగా గౌరవిస్తాయి. అలాంటి సింగపూర్ పెట్టుబడులు తమ దేశానికి వస్తాయంటే... ప్రపంచంలో ఏ దేశమైనా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సింగపూర్ ఒక చోట పెట్టుబడులు పెట్టింది అంటే... అక్కడ పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్తు బాగుంటుందని ప్రపంచ కార్పొరేట్లు నమ్ముతారు. అలాంటి సింగపూర్ కు నమ్మకం కలిగించింది చంద్రబాబు పాలన. 

వందేళ్ల విజన్ తో అమరావతికి రూపకల్పన చేయాలనుకున్న చంద్రబాబు విజనే వారిని ఇలా ఆకర్షించింది. కానీ చంద్రబాబు ఆలోచనకు, ప్లానింగ్ కు అడ్డుపడకపోతే ఇక భవిష్యత్తులో ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేను అన్న నమ్మకంతో... ఏకంగా చంద్రబాబు వ్యక్తిత్వంపైనే దెబ్బకొట్టింది ప్రతిపక్షం. ఓటర్ల మైండ్ ను పొల్యూట్ చేసి తప్పు దారి పట్టించేందుకు ఆనాటి ప్రతిపక్షం చేయని ప్రయత్నం లేదు. అనేక రాజకీయ పద్మవ్యూహాలు రచించి వాటిలోకి చంద్రబాబును దింపి చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమి వైపు నడిపించడంలో వైసీపీ వంద శాతం విజయం సాధించింది.

పోనీ ప్రతిపక్షంలో ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక... చంద్రబాబు చేసిన తప్పులు ఉంటే కేసులు వేసి, మంచి ఉంటే కొనసాగించి ఉంటే బాగుండేది. కానీ చంద్రబాబు మీద పగతో, చంద్రబాబు చేసిన ప్రతి పనీ తప్పు అని నిరూపించడం కోసం రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తుకు నష్టం జరిగినా పర్లేదు. చంద్రబాబును మాత్రం డ్యామేజ్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే అమరావతికి మరణశాసనం రాస్తున్నారు. 

అసలు మెసపటోనియా నాగరికత, సింధు నాగరికత ప్రపంచంలో ఇలా ఏ ప్రాచీన నాగరికతలు తవ్వితీసినా... అవన్నీ నదీ తీరాల పక్కనే విలసిల్లాయి. నది జనావాసానికి మూలం. మనిషి జీవనానికి మూలం. వరద వస్తే మునుగుతుంది అని నదులకు దూరంగా ఉండటం అంటే... ప్రమాదాలు జరుగుతాయని వాహనాలు వద్దనుకోవడం లాంటిదే. అయితే, ఇవన్నీ జగన్ కి తెలియనివి కావు. కానీ... చంద్రబాబు ఇపుడు డ్యామేజ్ చేస్తే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీని చంపేసి వైసీపీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలన్న లక్ష్యంతో జగన్ ముందుకు పోతున్నారు. తాను మంచి పనులు చేసి ఆ రికార్డు సాధించాలంటే... అది అయ్యేపనికాదు. అందుకే మంచి పథకాలు పెట్టడంతో పాటు మరోవైపు చంద్రబాబు చేసిన మంచి పనులు మొత్తం తప్పని నిరూపించడం ద్వారా జనాల మెదళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ సమూలంగా తుడిచివేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత.

ఈ క్రమంలో జగన్ సాధించిన అతిపెద్ద విజయం... సింగ్ పూర్ ప్రభుత్వం అమరావతికి దూరం జరిగేలా చేయడం. సింగపూర్ అక్కడి నుంచి వెళ్లిపోవడం అంటే... పెట్టుబడులు అమరావతి వైపు చూడకుండా చేయడమే. అమరావతిపై సింగపూర్ రెడ్ మార్క్ పడింది అంటే ఇక ఏ కంపెనీ అక్కడ పెట్టుబడులు పెట్టదు. అపుడు చూశారా చంద్రబాబు ఎంత రాంగ్ ప్లేస్ ఎంచుకుంటున్నారో అని జనాల్ని నమ్మించే వ్యూహంలో వైసీపీ ముందుకు వెళ్తోంది. చంద్రబాబు ఎంత సేపు విజన్ ... తప్ప రాజకీయ కుట్రలను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యంగా ఉండటం, రాజకీయాల్లో పదవులను ఆశించిన వ్యాపారులను దూరం పెట్టడంలో విఫలం కావడం, అధికారం లేనపుడు పార్టీతో ఉండగలిగిన నాయకులను తయారుచేసుకోవడంలో విఫలం కావడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఇపుడు పెద్ద ముప్పు వచ్చింది.

ఇప్పటికి కూడా మేల్కొనకపోతే... తెలుగుదేశం చేసిన ప్రతి పనీ చారిత్రక తప్పిదమే అని జనాలకు నిరూపించడంలో వైసీపీ సక్సెస్ అవుతుంది. అబద్ధం, నిజం అనే వాటితో సంబంధం లేదు. ఏది జనాలకు ఎక్కువ తెలుసు అనేదే ఈ ఇంటర్నెట్ ప్రపంచం సూత్రం. మరి దీనిని తెలుగుదేశం ఎంత వరకు అర్థం చేసుకుని ముందుకు దూసుకెళ్తుందో వేచి చూడాలి.