కేసీఆర్‌తో జాగ్రత్త జగన్.. హెచ్చరిస్తున్న ఏపీ మేధావులు

July 07, 2020

వైఎస్ జగన్మోహనరెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నెల రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆరు సార్లు భేటీ అయ్యారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య సయోధ్య మంచిదే కానీ కేసీఆర్‌తో మితిమీరిన స్నేహం ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగిస్తోందేమోనన్న భయాలు ఏపీ ప్రజల్లో కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కోసమే ఇద్దరూ భేటీ అవుతున్నట్లుగా కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఈ విషయంలోనే ఏపీ ప్రజలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి అక్కడి ఇంజినీర్లు, మేధావుల సహకారంతో తెలంగాణపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నారు. ముఖ్యంగా నదీ జలాలు, నీటిపారుదల వ్యవహారాలపై విస్తారంగా జ్ఞానం పెంచుకున్నారు. ఏం చేస్తే తెలంగాణకు లాభమనేది ఆయనకు బాగా తెలుసు.. అలాగే, మిగతా వ్యవహారాలపైనా పట్టుంది. కానీ... పాలన పగ్గాలు తొలిసారి చేటపట్టిన జగన్‌కు ఈస్థాయి అవగాహన తక్కువేనని చెప్పుకోవాలి. ఆయన పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరిగి ప్రజాసమస్యలు తెలుసుకున్నది నిజమే. కానీ, ఆ సమస్యలపై నిపుణులతో లోతైన చర్చలు జరిపి.. పరిష్కార మార్గాలు వెతికే సమయం ఆయనకు ఇంతవరకు చిక్కలేదు. పాదయాత్ర పూర్తికాగానే ఎన్నికల ప్రచారం మొదలైపోయింది... దీంతో రాజకీయంగా లబ్ధి చేకూర్చే స్థాయిలో మాత్రమే ప్రతి అంశాన్నీ చూసే అవకాశముంటుంది కాబట్టి అంతకుమించి ముందుకువెళ్లే పరిస్థితి లేదు. జగన్ విషయంలోనూ అదే జరిగింది.
నదీ జలాలు, నీటి పారుదల వ్యవహారాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు వంటివన్నీ అత్యంత సంక్లిష్టంగా ఉండే అంశాలు. అందులో ఏ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోయినా, ఏ చిన్న అంశాన్ని విస్మరించినా, లైట్‌గా తీసుకున్నా భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. పైగా జగనే కాదు, ఆయన మంత్రులూ కొత్తవారే. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ స్నేహం ముసుగులో... తన మాటల మాయాజాలంతో జగన్‌ను, ఏపీ ప్రభుత్వాన్ని ఏమార్చి నీటి విషయంలో నష్టం కలిగిస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ ఏపీకి ఎగువ రాష్ట్రం కావడం... గోదావరి, కృష్ణా నదులు తెలంగాణని దాటుకుని ఏపీలో ఎంటర్ అవుతుండడంతో ఒప్పందాల్లో ఏ చిన్న తేడా జరిగినా ఏపీకి శాపంగా మారిపోతుందన్న భయం చాలామందిని వెంటాడుతుంది. పైగా... జగన్ కేసీఆర్‌ను బీభత్సంగా నమ్ముతుండడంతో అతి విశ్వాసం ఉన్న చోట మోసపోయే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు.
కాలేశ్వరం విషయంలో జగన్ ఒకప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేసినా మొన్న ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి ప్రశంసలు కురిపించడాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు. జగన్ సీఎం అయిన వారం రోజుల్లోనే కేసీఆర్ హైదరాబాదులోని ఏపీ భవనాలను తెలంగాణకు బదలాయించుకోవడం వంటివి చూసినవారంతా జాగ్రత్తగా ఉండకపోతే ముందుముందు కష్టమేనంటున్నారు.