జగన్‌ ప్రభుత్వంపై బాబు గెలిచాడు..

November 12, 2019

ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత వరుస పరాభవాలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు తొలిసారి విజయం దక్కింది. జగన్ ప్రభుత్వంపై ఆయన విజయం సాధించారు. అవును... తన భద్రత విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. చంద్రబాబు నాయుడుకు 97 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చంద్రబాబుకు 5 ప్లస్ టూ భద్రత కల్పించాలని ఆదేశించింది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు భద్రతను తగ్గించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు ఉద్దేశపూర్వకంగానే భద్రత తగ్గించారంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పిటీషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు నాయుడుకు ఇకపై 97 మందితో భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. అయితే.. సీఎస్‌వోను ఇంకొకరిని కేటాయించాలన్న చంద్రబాబు అభ్యర్థనకు మాత్రం ఆమోదం దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ వోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. అలాగే కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది.
మరోవైపు క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధుల నిర్వహణపై తాము చేయమని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్ జీ, ఐఎస్ డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది. చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. చంద్రబాబుకు 5ప్లస్ 2 భద్రత ఇవ్వాలని తేల్చి చెప్పింది.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 74 మందితో భద్రత కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. గతంలో కంటే చంద్రబాబుకు అదనంగానే భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయినా, కోర్టు మాత్రం చంద్రబాబు వాదనలతో ఏకీభవించి 97 మందితో భద్రత కల్పించాలని సూచించింది. అలాగే ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు కావాలని చంద్రబాబు హైకోర్టును కోరగా... ప్రతిపక్ష నేతకు ఎప్పుడూ ఒక సీఎస్ వోను మాత్రమే ఇస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు ప్రభుత్వ వాదననతో సంతృప్తి చెందడంతో అదనంగా మరో సీఎస్‌వోను చంద్రబాబుకు కేటాయించలేదు.