​కీలక అప్ డేట్ - అప్పట్లో సాయిరెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారా?

August 13, 2020

జగన్ మూడు రాజధానుల గురించి అందరికీ తెలిసిందే. ఎవరు ఎన్ని చెప్పినా తాను మూడు రాజధానులు పెట్టి తీరుతాను అని జగన్ అంటున్నారు. అది జరుగుతుందా? లేదా? అన్నది వేరే విషయం. అయితే, మార్పు అంటూ జరిగితే జగన్ ఏం చేస్తున్నాడు, ఎలా చేయాలనుకుంటున్నాడు అనేది ఇపుడు ప్రస్తావనార్హం. 

చాలా రోజుల నుంచి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తాను అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్లో ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ రాజధాని. అంటే ప్రభుత్వం ఎక్కడుంటే జనాలు దానినే రాజధానిగా భావిస్తారు. అంటే జగన్ బయటకు 3 రాజధానులు అని చెప్పినా... అతని దృష్టిలో ఒకటే రాజధాని. ఆ ఒకటి విశాఖ అని ప్రచారం జరుగుతోంది. 

అయితే, ఇపుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ‘‘ఏపీ పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో కాకుండా భోగాపురంలో ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు’’ ప్రముఖ తెలుగు పత్రిక ఆంధ్రజ్యోతి రాసింది.  భోగాపురం విమానాశ్రయం వద్ద 500 ఎకరాలను రాజధాని కొరకు ఏపీ ప్రభుత్వం కేటాయించినట్లు,  దాని అభివృద్ధి ప్రణాళికలకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను  ఖరారు చేసినట్లు, దానిని గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థకు అప్పగించినట్లు అందులో పేర్కొంది. 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ కంపెనీయే ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కడుతోంది. అంటే మోడీ తనన కలల ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థ, జగన్ కలల ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థ ఒకటే. మరి అదే కంపెనీని ఇద్దరు ఇష్టపడటం వెనుక కారణం ఏంటి అన్నది తెలియదు. 

అయితే... మనం  ఆరునెలల క్రితం జరిగిన ఒక విషయం గుర్తుచేసుకుంటే ఇది కొత్త విషయం కాదు అనిపిస్తుంది. ఎవరూ పట్టించుకోలేదు గాని... అప్పట్లో జగన్ అనుంగులు విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని దాదాపు చెప్పేశారు. అప్పట్లో ఆయన ఏమన్నారంటే... సచివాలయం ఉన్న కార్యనిర్వాహక రాజధాని భీమిలి ప్రాంతంలో వస్తుందని చెప్పారు. అది కూడా ఉత్తరం వైపు. శ్రీకాకుళం వైపు అన్నమాట. దీనికి రెండు కారణాలు అని మనం గుర్తించొచ్చు. ఒకటి అక్కడ అధికారంలోకి రాకముందే వైసీపీ నేతల భూములు బాగా ఉన్నట్టు, ఒక ప్రత్యేక ప్రణాళిక వారు రచించుకుంటున్నా ప్రచారం జరుగుతోంది. మరోటి సాంకేతిక కారణం... సముద్రతీరానికి దూరంగా ఉండటమే కాకుండా, విశాఖ కంటే ఈ ప్రాంతం సేఫ్ అని, భవిష్యత్తులో రాబోయే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ మరియు హబ్ వల్ల వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండటం కారణంగా చెబుతున్నారు. 

అంటే ఈ విషయం ఏదో జగన్ రాజకీయ ఆవేశంతో కాకుండా... పక్కా ప్లాన్ తో తన ఆలోచనలకు అనుగుణంగా రూపొందించినట్టు అర్థమవుతోంది. ఇక్కడ మోడీ ప్రియమైన కంపెనీని రంగంలోకి దించడం బట్టి చూస్తుంటే కేంద్రం అండదండలు గట్టిగానే ఉన్నట్టు అర్థమవుతుంది. ఇదే నిజమైతే బీజేపీ శాశ్వతంగా ఏపీని మరిచిపోయే పరిస్థితి వస్తుందేమో.