మరో వెనెజువెలాగా ఆంధ్రప్రదేశ్ !!

February 19, 2020

దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాకర్షక పథకాలు, అవినీతి పాలనతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తూ వచ్చారు. ఇప్పుడది పీక్ స్టేజికి చేరుకుందని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తుండగా... ఇదే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మరో వెనెజ్వెలాగా మారడం ఖాయమని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆర్థికంగా కుదేలైన ఉదంతాలున్నాయి.. సాధారణంగా అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, అంతర్జాతీయంగా ఇతర దేశాల ఆంక్షల ఫలితంగా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. కానీ, ఏపీలో మాత్రం నాయకుల పొరపాట్లు, అనాలోచిత విధానాలు, సంక్షేమం పేరుతో వినాశకర విధానాలు అమలుచేయడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం పీక్ స్టేజీకి చేరిన సంక్షోభం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి సగటు పౌరుడి జీవితంపైనా ప్రభావం చూపుతోంది. 70 శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉచిత పథకాలు, విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న మద్యం వారిని అసలు సమస్యను గుర్తించలేనట్లుగా మార్చేశాయి.
రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మంది ప్రజలకు తమ జీవితం తాము గడపడానికి సరిపడినంత సంపాదన లేనేలేదు. పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రూ.2కే కిలో బియ్యం, ఉచిత కరెంటు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయ రుణాల మాఫీ ఇలా పూర్తిగా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ.. ఎవరు ఎక్కువ దయ చూపిస్తారో వారికే ఓటేస్తామనే దయనీయమైన పరిస్థితికి వచ్చారు. అంతేకానీ.. తమ సంపాదన ఎందుకు పెరగడం లేదు.. ప్రభుత్వాలు ఈ ఉచిత పథకాలు ఆపేస్తే ఒక్క నెల రోజులైనా బతకగలమా అన్న ఆలోచన చేయలేకపోతున్నారు.
2019 మార్చి నాటికి ఉన్నలెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 శాతం ప్రజలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆధారపడి బతుకుతున్నారు. వారిని బతికిస్తున్న ప్రభుత్వం అప్పటికే దివాలా తీయడం మరో గొప్ప విషయం. ఇక చదువుకున్నవారు, మేధావుల్లో 50 శాతానికి పైగా రాష్ట్రాన్ని వీడి ఇతర ప్రాంతాల్లో బతుకుతున్నారు. రాష్ట్రం నడవడానికి అప్పులు చేస్తూ పోతున్న ఆంధ్రప్రదేశ్ దేశంలో ఇంకే రాష్ట్రంలో లేనట్లుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 3.5 శాతం దాటి రుణాలు తీసుకుంటోంది. 2019 ఆగస్టు నాటికి ఏపీ ఇంకే రాష్ట్రంలో లేనట్లుగా అక్కడ జరిగిన వివిధ పనులకు సంబంధించి 25 వేల కోట్లు బకాయి పడింది. నిధులు లేకపోవడంతో విద్య, వైద్య పథకాలకు చెల్లింపు ఆగిపోయి అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. పనితీరుతో సంబంధం లేకుండా ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగిపోయాయి.. ఇది ఖజానాపై భారం మోపుతోంది. పెన్షన్లు పేరుతో ఇస్తున్న డబ్బులు ఇంకా పెంచేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. అయినా, ప్రభుత్వాలు కొత్త సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు ఇస్తూనే వెళ్తున్నాయి. ఇవన్నీ పార్టీలు, ప్రభుత్వాలు, నాయకుల ప్రతిష్ఠ పెంచుకోవడానికే అన్నట్లుగానే ఉన్నాయి కానీ రాష్ట్రం బాగుకోసం అన్నట్లుగా లేవు. దీంతో... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది. చివరకు ఆంధ్రప్రదేశ్ మరో వెనెజ్వెలాగా మారిపోయే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.