జగన్ యాంటీ లోకల్ - రగిలిపోతున్న ఏపీ జర్నలిస్టులు

July 05, 2020

తెలంగాణకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్‌ను ఏపీ ప్రభుత్వానికి జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా నియమించడం ఏపీ మీడియలో తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తోంది. అమర్ నియామకంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొందరు సీనియర్ జర్నలిస్టులు, పలు పత్రికల ఎడిటర్లు విజయవాడలో భేటీ అయ్యారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు చెందిన అమర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ డిమాండుకు బలంగా మద్దతిచ్చి రాష్ట్ర విభజనను కోరుకున్న వ్యక్తని, అలాంటి వ్యక్తిని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎలా నియమించుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమైంది ఆ సమావేశంలో.
‘‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమర్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజనకు డిమాండ్ చేస్తూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోరుతూ పలు పత్రికల్లో వందల కొద్దీ వ్యాసాలను ఆయన రాశార’’ని భేటీలో పాల్గొన్న పాత్రికేయులు గుర్తుచేశారు. ఆంధ్రను తీవ్రంగా వ్యతిరేకించే ఒక జర్నలిస్టును ఏకంగా ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా నియమించడం ఏపీ జర్నలిస్టులకు అవమానకరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన్ను తెలంగాణ ప్రభుత్వమే ఎలాంటి పదవిలోనూ నియమించలేదని అనుకున్నారు. అంతేకాదు... అమర్ కూడా ఏపీ ప్రభుత్వంలో ఇలాంటి పదవిని ఎలా తీసుకుంటారన్న ప్రశ్న అక్కడ వ్యక్తమైంది.
ఐఅండ్ పీఆర్ కమిషనర్ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తేనని... ఇప్పుడు తెలంగాణకే చెందిన అమర్‌ను ఇలా కీలక పదవిలో నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అమర్ నియామకంపై జగన్ పునరాలోచించాలని కోరారు.
కాగా అమర్ నియామకంపై కొందరు జర్నలిస్టు పెద్దలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నా మరికొందరు మాత్రం ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో కిమ్మనకుండా ఉన్నారు. మరి జర్నలిస్టులు ఈ విషయంలో తమ అసంతృప్తిని జగన్ వరకు తీసుకెళ్తారా.. లేదా దిగమింగుకుంటారా చూడాలి.