సంక్షోభాల్ని తట్టుకునే ఆ దేశాధినేతే వణుకుతున్నారు

August 11, 2020

ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి.. శాస్త్రసాంకేతిక రంగంలో తన సత్తా ఏమిటో చూపించే దేశం జర్మనీ. ఆ దేశానికి అధినేతగా వ్యవహరిస్తున్న ఉక్కుమహిళ ఏంజెలా మెర్కెల్. సంక్షోభాలు ఎన్ని వచ్చి పడినా.. కించిత్ కదలకుండా.. ధీమాను ప్రదర్శించే ఆమె.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు. ఇటీవల కాలంలో జర్మనీని కమ్మేసిన శరణార్థుల సమస్య.. బ్రెగ్జిట్.. ఆర్థిక మందగమనం లాంటి సమస్యలు తమపై దండెత్తినా బెదరని ఆమె.. తాజాగా విరుచుకుపడుతున్నపిశాచి వైరస్ విషయంలో మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.
తాజాగా ఆమె కరోనా మీద ఓపెన్ అయ్యారు. మెర్కెల్ లాంటి ఐరన్ లేడీని సైతం కదిలించిన క్రెడిట్ కరోనా వైరస్ దేనని చెప్పాలి. తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు కరోనానే అని పేర్కొన్నారు. పరిశుభ్రతను దేశ ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే కరోనాను విజయవంతంగా జయించవచ్చన్నారు.
దేశ ప్రజలంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా కేవలం కళ్లతోనే పలుకరించుకోవాలంటూ ఇటీవల చెప్పిన ఆమె.. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఉండే ప్రయాణ హక్కును కాదనటం భావ్యం కాదన్నారు. అలా అని.. తాము చేపట్టే చర్యలన్ని కూడా ప్రజల కోసమేనని చెప్పటం ద్వారా.. ప్రభుత్వ నియంత్రణల్ని ప్రజలు ఆమోదించాలని.. ఇబ్బందుల్ని తట్టుకోవాలన్న సందేశం ఆమె మాటల్లో వినిపించింది. కరోనా ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితి మీద పడకుండా తాము చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి భరోసా వ్యాఖ్యలే ప్రజల్లో కొత్త ఆశలు ఉదయించేలా చేస్తాయని చెప్పక తప్పదు.