అతను అంబానీని బెదిరిస్తున్నాడు

May 28, 2020

కార్పొరేట్ ప్రపంచంలో మొన్నటి వరకూ ఒక వెలుగు వెలిగిన రిలయన్స్ బ్రదర్స్ లో ఒకరైన అనిల్ అంబానీకి ఇటీవల కాలంలో కలిసి రావటం లేదు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన కంపెనీకి.. ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. కంపెనీ ప్రస్తుత పరిస్థితిపై వార్షిక వాటాదారుల సమావేశంలో వాటాదారులు ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  
అనిల్ అంబానీ సంస్థల పేలవమైన పని తీరు కారణంగా తాము దారుణంగా నష్టపోయినట్లుగా వారు వాపోతున్నారు. కంపెనీ కారణంగా తాను పెద్ద మొత్తంలో సంపద కోల్పోయినట్లుగా వాపోయిన ఒక వాటాదారు.. అనిల్ అంబానీ గ్రూపుల మీద దావా వేస్తానని హెచ్చరిస్తున్నాడు.
రెండు.. మూడు నెలల వ్యవధిలో సమస్యల్ని పరిష్కరించకుంటే.. గ్రూప్ కంపెనీలపై ఫస్ట్ క్లాస్ యాక్షన్ దావా వేస్తానని చెబుతూ.. తానీ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టనని చెబుతున్నారు ఒక కార్పొరేట్ లాయర్. 2005 నుంచి మూడు రిలయన్స్ గ్రూపు కంపెనీల్లో తాను సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టానని.. విలువలో 90 శాతానికి పైగా నష్టపోయినట్లు చెప్పారు.
ఈ సమస్య అంతా గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ తన షేర్లలో 80 శాతానికి పైగా షేర్లను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి అప్పు తీసుకోవటంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. ఈ నిర్ణయం తనను నాశనం చేసిందన్న సదరుకార్పొరేట్ లాయర్.. కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టి భారీగా నష్టపోయినట్లు వాపోతున్నారు.
కంపెనీకి డౌన్ గ్రౌడ్ రేటింగ్ ఇచ్చిన రోజే తాను రూ.37లక్షలు పోగొట్టుకున్నట్లు చెప్పిన ఆయన.. తన ప్రశ్నలకు సమాధానాలు సంతృప్తికరంగా రాని పక్షంలో రానున్న రెండు.. మూడు నెలల్లో ఆర్ పవర్ పై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని హెచ్చరించారు. ఇందుకోసం తాను మిగిలిన 10 శాతం వాటాదారులను కూడగడతానని చెప్పారు. అనిల్ అంబానీ మీద కేసు వేస్తానని చెప్పిన లాయర్ ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదును చేయలేదు. ఒకవేళ అలాంటిది చోటు చేసుకుంటే మాత్రం ఈ వ్యవహారం మరో సంచలనంగా మారటం ఖాయం.