అనిల్ అంబానీ.. బిలియ‌నీర్ క్ల‌బ్ నుంచి ఔట్‌

May 26, 2020

బండ్లు ఓడ‌లు.. ఓడ‌లు బండ్లు కావ‌టం మామూలే. ఇప్పుడీ మాట‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నారు అనిల్ అంబానీ. ప‌దకొండేళ్ల‌ క్రితం అడాగ్ గ్రూప్ అధినేత‌గా అనిల్ అంబానీ స్థానం ప్ర‌పంచ కుబేరుల్లో ఆరో స్థానంగా నిలిచారు. అలాంటి పెద్ద మ‌నిషి వ‌రుస‌గా వ‌చ్చి ప‌డుతున్న న‌ష్టాల‌తో బిలియ‌నీర్ క్ల‌బ్ నుంచి ఔట్ అయిన ప‌రిస్థితి.
ప‌దేళ్ల క్రితం 42 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌లో అప‌ర కుబేరుడిగా ఉన్న ఆయ‌న‌. .ఇప్పుడు హాఫ్ బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో బిలియ‌నీర్ క్ల‌బ్ నుంచి ఆయ‌న పేరు తొల‌గిపోయింది. తాజాగా అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ సుమారు రూ.3651 కోట్లుగా అంచ‌నా వేస్తున్నారు. అంటే.. హాఫ్ బిలియ‌న్ డాల‌ర్లన్న మాట‌. అప్పుల సంక్షోభంతో పాటు టెలికాం సంస్థ ఆర్ కాంతో పాటు ఇత‌ర గ్రూపు సంస్థ‌లు వ‌రుస న‌ష్టాల నేప‌థ్యంలో అనిల్ అంబానీ వ్యాపార ప్ర‌పంచం మొత్తం కుప్ప‌కూలిపోయింది.
వ‌రుస న‌ష్టాల‌తో రుణ‌దాత‌ల‌కు తీర్చాల్సిన అప్పులు అంత‌కంత‌కూ పెరిగిపోతుండ‌టంతో ఆయ‌న త‌న ప్ర‌ధాన ఆస్తుల్ని.. వ్యాపారాల్ని అమ్మేయ‌టం షురూ చేయ‌గానే మార్కెట్లో ఆయ‌న ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. మ్యూచువ‌ల్ ఫండ్ జాయింట్ వెంచ‌ర్ రిల‌య‌న్స్ నిస్సాన్ లైఫ్ అసెట్ మేనేజ్ మెంట్ లో బ్యాంకులు 43 శాతం వాటాల‌ను అమ్మ‌టం షాకింగ్ ప‌రిణామంగా మారింది.
గ‌డిచిన 14 నెల‌ల్లో తాను మొత్తం రూ.35వేల కోట్ల‌కు పైగా రుణాల్ని తీర్చిన‌ట్లుగా అనిల్ అంబానీ పేర్కొన్నారు. నాలుగు నెల‌ల క్రితం కూడా బిలియ‌న్ డాల‌ర్ల కంటే ఎక్కువ విలువ ఉన్న ఆయ‌న కంపెనీ ముఖ‌విలువ‌.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో స‌గానికి పైగా ప‌డిపోవ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. వ్యాపారంలో ఎలాంటి త‌ప్పులు చేయ‌కూడ‌ద‌న్న విష‌యం అనిల్ అంబానీని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు.