లాజిక్‌తో ఫుట్‌బాల్ ఆడుకున్న రావిపూడి

May 26, 2020

లాజిక్కుల‌తో ఫుట్‌బాల్ ఆడుకోవ‌డంలో టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌ను మించిన వాళ్లు లేర‌ని పేరు. పోయినేడాది సంక్రాంతికి బోయ‌పాటి అనే ద‌ర్శ‌కుడు విన‌య విధేయ రామ సినిమాలో చూపించిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. హైద‌రాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్న హీరో బీహార్లో ఉన్న త‌న అన్న‌కు ఏదో జ‌రిగింద‌ని.. ఎయిర్ పోర్టు నుంచి దూకి నేరుగా ట్రైన్ ఎక్కి టాప్ మీద నిల్చుని బీహార్ వెళ్లిపోవ‌డం మొద‌లుకొని.. విష‌నాగు కాటేస్తే విల‌న్ చ‌నిపోవ‌డం పోయి ఆ నాగుపామే చ‌నిపోవ‌డం వ‌ర‌కు అందులో లాజిక్ అనే మాట‌కు అర్థం లేకుండా చేసిన స‌న్నివేశాలు ఎన్నో. ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా పోయినేడాది విన‌య విధేయ రామ వ‌చ్చిన‌ జ‌న‌వ‌రి 11నే రిలీజైన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కూడా బోయ‌పాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో లాజిక్ అనే మాట‌ను ర‌ఫ్ఫాడుకున్నాడు.
మంత్రిగా ఉన్న విల‌న్ పెన్ష‌న్ ప‌థ‌కాన్ని అడ్డు పెట్టుకుని ఏకంగా 5 వేల కోట్ల రూపాయ‌లు కొట్టేస్తాడ‌ట‌. కేవ‌లం ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను, ఒక బ్యాంకు ఉద్యోగిని చంపేయ‌డం ద్వారా ఇంత పెద్ద స్కామ్‌ను బ‌య‌ట‌కి రానివ్వ‌కుండా తొక్కి పెట్టేస్తాడ‌ట‌. దీని గురించి ఎవ‌రికీ తెలియ‌కుంటే హీరో వ‌చ్చి ఒక‌ట్రెండు రోజుల్లో మొత్తం బ‌య‌ట పెట్టేస్తాడ‌ట‌. ఇదే విడ్డూరం అంటే.. ఎన్నో దారుణాలు చేసిన ఫ్యాక్ష‌నిస్టు విల‌న్ని చివ‌ర్లో త‌న‌తో పాటు హీరో క‌శ్మీర్‌కు తీసుకెళ్లి అక్క‌డ ఒక మూడు నెల‌లు ఆర్మీ ట్రైనింగ్ ఇప్పిస్తే అత‌ను మంచోడు అయిపోతాడ‌ట‌. తిరిగి క‌ర్నూలుకు వ‌చ్చి తాను దోచుకున్న సొమ్మునంతా బాధితుల‌కు పంచేస్తాడ‌ట‌. ఎంత క‌మ‌ర్షియ‌ల్ సినిమా అయినా కూడా మ‌రీ ఇంత విడ్డూర‌మైన‌, లాజిక్‌కు అంద‌ని స‌న్నివేశాలు పెట్ట‌డ‌మేంటో? అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్ష‌కులంటే మ‌రీ చిన్న‌చూపున్న‌ట్లుంది. లేదంటే ఇంత సిల్లీ సీన్లు తీస్తాడా?