వైసీపీ ఫీలింగ్: చింతమనేని బయట ఉంటే కష్టమే

July 12, 2020

టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారనే చెప్పాలి. టీడీపీ అధికారంలో ఉండగా... పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఏపీవ్యాప్తంగా అందరి నోటా నానిన చింతమనేని... వైసీపీకి సింహస్వప్నంగానే మారిపోయారని చెప్పక తప్పదు. అందుకేనేమో... వైసీపీ అధికారంలోకి రాగానే... టీడీపీ నేతలను నేరుగానే టార్గెట్ చేసిన జగన్ సర్కారు... తొలుత చింతమనేనినే లక్ష్యంగా ఎంచుకుంది. పాత కేసులు, వాటికి తోడుగా కొన్ని కొత్త కేసులను పెట్టేసిన జగన్ సర్కారు... చింతమనేనిని జైలులోకి పంపింది. చింతమనేని అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న రచ్చతో వైసీపీ నేతలు బాగానే జడిసిపోయినట్టున్నారు. ఈ క్రమంలోనే చింతమనేనిని సాంతం జైల్లోనే పెట్టేందుకు పథకం రచించారన్న వాదనలు వినిపించాయి. అందులో భాగంగానే... ఓ కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు, అందులోనూ బెయిల్ వస్తుందనుకుంటే ఇంకో కేసు... ఇలా ఇప్పటిదాకా చింతమనేనిపై ఏకంగా 18 కేసులు పెట్టేశారు. 

అయితే 18 కేసుల విచారణను కూడా ధైర్యంగానే ఎదుర్కొన్న చింతమనేని.. మొన్న ఆ కేసులన్నింటిలో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. చింతమనేని ఇలా బయటకు వచ్చారో, లేదో... అప్పుడే వైసీపీ నేతలు గిలగిల్లాడిపోయారు. మరోమారు చింతమనేనిని జైలుకు పంపేలా ఏం చేద్దామన్న కోణంలో ఆలోచనలు చేసిన వైసీపీ సర్కారు... చింతమనేని బెయిల్ పై విడుదల అయిన మరునాడే ఆయనపై ఇంకో కేసు పెట్టేశారు. ఈ కేసు వివరాలు చూస్తే... జగన్ సర్కారు చింతమనేనిని ఏ మేర టార్గెట్ చేసిందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. తాజా కేసు వివరాల్లోకి వెళితే... ఏలూరులోని జిల్లా జైలు నుంచి విడుదలైన చింతమనేనిని ఆయన అనుచరులు సమీపంలోని దెందులూరుకు ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ ర్యాలీ జరుగుతున్నంత సేపు ప్రేక్షకుల్లాగే వ్యవహరించిన పోలీసులు... ర్యాలీ ముగిసి 24 గంటలు గడిచిన తర్వాత కేసు నమోదు చేశారు. 

ప్రస్తుతం ఏలూరు, దెందులూరుల్లో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, ఈ యాక్ట్ అమల్లో ఉంటే ర్యాలీలకు అనుమతి లేదని, ర్యాలీలు నిర్వహించాలన్న తమ అనుమతి తీసుకోవాలని చెబుతున్న పోలీసులు... ఎలాంటి అనుమతి లేకుండానే చింతమనేని ర్యాలీ నిర్వహించారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు అంత పెద్దదేమీ కాకున్నా... స్టేషన్ బెయిల్ తోనే చింతమనేని బయటకు వచ్చే అవకాశమున్నా... బెయిల్ పై విడుదల కాగానే... సెక్షన్లు వెతికి మరీ కేసులు పెట్టడాన్ని చూస్తుంటే... చింతమనేని అంటే.. వైసీపీ ఎంతగా వణికిపోతోందోనన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.