ప్రత్యేక హోదాపై మరో కుట్ర! పొరుగు రాష్ట్రాలను రెచ్చగొడుతున్నారా..

December 14, 2019

విభజన చట్టం బిల్లు పార్లమెంట్‌లోకి వచ్చినప్పుడు ఏపీ తీవ్రంగా నష్టపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆ రోజు రాజ్యసభలో ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని గొంతెత్తి గళం వినిపించారు. ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేకహోదా ప్రకటించారు. కానీ తీరా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకహోదా విషయంలో ముఖం చాటేసింది. దీనిపై చంద్రబాబు ఎంత పోరాటం చేసినప్పటికీ మొండి చేయి చూపించింది బీజేపీ పార్టీ. అయితే ప్రజలు అన్నీ చూస్తూంటారనే సంగతిని మర్చిపోకూడదు. ఒకప్పుడు హోదా సాధించామని సన్మానాలు చేసుకున్నది కూడా బీజేపీ వాళ్లే. ఇప్పుడు నిధులు ఎక్కడ్నుంచి వస్తాయంటున్నది కూడా బీజేపీ వాళ్లే. ఎన్ని నిధులు కావాలో కనీసం చెప్పలేదు కదా..! ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా ఆ పేరు లేకపోయినా.. అంతకు మించిన నిధుల లబ్ది కలిగిస్తామని చెప్పి ప్యాకేజీ ప్రకటించారు. హోదా పేరు లేదు కానీ అంత కన్నా ఎక్కువే ఇస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. 

మరి అప్పుడు మాత్రం నిధులు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఇప్పుడు నిధులు ఎక్కడ్నుంచి వస్తాయని అడుగుతున్న అరుణ్ జైట్లీ.. ప్యాకేజీలో హోదా కన్నా ఎక్కువ ఇస్తున్నామని చెబుతున్నారు కదా! అవి ఎక్కడ్నుంచి వచ్చాయి..? భారతీయ జనతా పార్టీ నేతలు చాలా రోజులుగా ఏపీకి అన్నీ ఇచ్చేశామని అంటూనే ప్రత్యేకహోదా వస్తే ఎన్ని నిధులు వస్తాయో. అంత కన్నా ఎక్కువే ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు అరుణ్ జైట్లీ ప్రకటనపై వారు నోరు విప్పాలి. ఏపీకి అన్నీ ఇస్తే ప్రత్యేకహోదాకు నిధులు ఎక్కడ్నుంచి వస్తాయని జైట్లీ ఎందుకు చెబుతున్నారో అడగాలి. ఏపీకి హోదా ఇస్తే బెంగాల్, బీహార్, ఒడిషా లాంటి రాష్ట్రాల పరిస్థితేమిటని జైట్లీ మరో ప్రశ్న వేశారు. బీహార్‌కు అసెంబ్లీ ఎన్నికలకు ముందు… మోడీ ఏకంగా లక్షా అరవై వేల కోట్లు ప్యాకేజీ ప్రకటించారు. అప్పుడు పక్కనున్న యూపీ, జార్ఖండ్, బెంగాల్ అడగలేదా..?. నిన్నటికి నిన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏపీకి వచ్చి ప్రత్యేకహోదాకు మద్దతు ప్రకటించలేదా..? ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తూండగానే అరుణ్ జైట్లీ ఏ లాజిక్ ప్రకారం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేకహోదా అంశాన్ని ప్రశ్నించారు. నిధులు ఎక్కడ్నుంచి వస్తాయి..? ఇతర రాష్ట్రాల సంగతేమిటని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అనేది ప్రస్తుతం జనం మదిలో మెదులుతున్న ఆలోచన.

అసలు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో… ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటే.. ఇప్పటి వరకూ పధ్నాలుగో ఆర్థిక సంఘాన్ని కారణంగా చూపేవారు. నేరుగా పార్లమెంట్‌లోనే.. ఈ ప్రకటన చేశారు. పధ్నాలుగో ఆర్థిక సంఘం వద్దన్నది కాబట్టి ఇవ్వలేదంటున్నారు. హోదా పేరు లేకపోయినా… మొత్తం నిధులిస్తున్నామని చెప్పారు. మరి కొత్తగా.., ఈ నిధులు, ఇతర రాష్ట్రాల వాదన ఎందుకు తీసుకొస్తున్నారు..?. ఏపీ ప్రత్యేకహోదా విషయం వస్తే.. ఇతర రాష్ట్రాల అంశాలను తెరపైకి తెస్తున్నారు. అంతా ఓ కుట్ర ప్రకారం చేస్తూ… జగన్ పార్టీ మద్దతుతో గట్టెక్కాలనుకుంటున్నారు.