గుడివాడ గడ్డపై రసవత్తర పోరు

September 17, 2019

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ సొంత గడ్డ గుడివాడలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ పట్టు సాధించేందుకు టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ ఎన్నికల బరిలోకి దిగడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. వైసీపీ పక్షాన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని బరిలో ఉండటంతో ఇక్కడి పోరు జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్‌ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని విజయం సాధించారు. ఆయన పార్టీని వీడే క్రమంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని పెంచాయి. గుడివాడ పట్టణంలో వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేసే విషయంలోనూ ఎమ్మెల్యే నాని సీఎం చంద్రబాబుపై నోరుపారేసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నానిని ఓడించాలని టీడీపీ అధిష్ఠానం తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపింది.
క్యాడర్‌ అంతా ఒక్కటిగా..
టీడీపీ క్యాడర్‌ను ఎమ్మెల్యే నాని తనతో తీసుకువెళ్లిపోవడంతో 2014లో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు ఓడిపోయారు. ఆయన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి హోదాలో ఈ నియోజకవర్గంలో రూ.1400 కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పార్టీని బలోపేతం చేశారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ బరిలోకి దిగడంతో పార్టీ నేతలు గ్రూపు విభేదాలు వీడి టీడీపీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఒక్కటిగా పనిచేస్తున్నారు.
వినూత్నంగా అవినాష్ ప్రచారం
ప్రజల్లో ఒకడిగా కలసిపోతూ అవినాష్‌ చేస్తున్న ప్రచారం మాస్‌లో ఆయనపై విపరీతమైన క్రేజ్‌ను పెంచుతోంది. మున్సిపల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావుకు, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలు, గుడివాడ మండలంలో సగభాగం గతంలో ముదినేపల్లి నియోజకవర్గంలో భాగమై ఉండటంతో అక్కడి నుంచి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావుకు ఆయా మండలాల్లో బలమైన వర్గముంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకులు ఉన్నారు. టీడీపీ జెండా గుడివాడ గడ్డపై మళ్లీ ఎగరనుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1983 నాటి పూర్వవైభవం సాధించేదిశగా కదం తొక్కుతున్నారు.
మండలానికో వ్యూహం
టీడీపీకి పెట్టనికోటగా ఉన్న గుడ్లవల్లేరు మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్యచౌదరి నాయకత్వంలో ప్రచారం ప్రారంభించారు. మండలంలో ఈసారి పది వేలకు పైగా మెజార్టీ సాధిస్తామని అక్కడి నాయకులు పేర్కొంటున్నారు. నందివాడ మండలంలోని జనార్థనపురంలో గత ఎన్నికల్లో వైసీపీలో ఉన్న టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మలిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరడంతో గ్రామ రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఇది టీడీపీకి అనుకూలాంశం. నందివాడ మండల కేంద్రంలో కీలక నేత వేములపల్లి వెంకటేశ్వరరావు(బాబు) టీడీపీ తరపున కీలకంగా వ్యవహరిస్తుండటం కూడా ఈ ఎన్నికల్లో పార్టీకి కలసివచ్చే అవకాశం. మండల పార్టీ అధ్యక్షుడు అరికెపూడి రామశాస్త్రులు పార్టీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. గుడివాడ రూరల్‌ మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు వాసే మురళీ, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ గుత్తా చంటి పార్టీలో వర్గాలను రూపుమాపి ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.
నందివాడ నుంచి నాని ప్రచారం
మరోవైపు కొడాలి నాని వైసీపీకి పట్టు ఉన్న నందివాడ మండలం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నామినేషన్‌ దాఖలు చేసిన ఆయన వైసీపీకి ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్న ఓటుబ్యాంకును కాపాడుకునే దిశగా పావులు కదుపుతున్నారు. గుడివాడ పట్టణంలో వైసీపీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీకి బలమైన గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే నాని వ్యూహాలు పారడం లేదు. టీడీపీలోని విభేదాలను సొమ్ము చేసుకుందామని ఆశించినా, అవినాష్‌ రాకతో వాటికి బ్రేక్‌ పడింది. గుడివాడ రూరల్‌లో ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆ మండలంపై పట్టు బిగించేందుకు చూస్తున్నారు.
జనసేన చీల్చేది ఎవరి ఓట్లో!
నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా టీడీపీ, వైసీపీల నడుమే నెలకొన్నా జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీలో నిలవనున్నారు. జనసేన గుడివాడ సీటును బీఎస్పీకి రిజర్వ్‌ చేసిందనే వదంతులు ఉన్నాయి. అయితే జనసేన ఎవరి ఓట్లను చీల్చుతుందో తేలాల్సి ఉంది. జనసేన పోటీ చేస్తే ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు బూరగడ్డ శ్రీకాంత్‌, బీఎస్పీకి కేటాయిస్తే మెండా కిరణ్‌కుమార్‌ అభ్యర్థులుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పటికే గుత్తికొండ శ్రీరాజబాబును అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ శిష్ట్లా దత్తాత్రేయులు బరిలోకి దిగనున్నారు. పోటీ నామమాత్రమైనా ఆయా పార్టీలకు పడే ఓట్లు టీడీపీ, వైసీపీల విజయావకాశాలపై ప్రభావం చూపుతాయనేది పరిశీలకుల మాట.