ఏపీ అసెంబ్లీ - మీడియాకు ఆంక్షలు !!

August 10, 2020

సాధారణ జనజీవనాన్ని సమూలంగా మార్చేసిన కరోనా... తన ప్రతాపాన్ని ఇపుడు అసెంబ్లీపై కూడా చూపింది. ఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రత్యేక ఆంక్షలు విధించారు. కరోనా నేపథ్యంలో ఈ ఆంక్షలు పెట్టినట్టు అసెంబ్లీ కార్యదర్శి తెలపగా... ఇందులో అసెంబ్లీ మీడియా పాయింట్ ను రద్దు చేయడం కీలకమైన ఆంక్షల్లో ఒకటి.

అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు, చర్చలు, వాగ్వాదాలు కామన్. వీటిపై నేతలు బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు. అసెంబ్లీ బయట మనం చూసే ప్రెస్ మీట్లు అన్నీ ఇక్కడివే. ఇక కరోనా నేపథ్యంలో ఆ అవకాశం లేదు. అయితే, అసెంబ్లీలో మీడియా గ్యాలరీకి మాత్రం జర్నలిస్టులను అనుమతించనున్నారు. 

అసెంబ్లీ సమావేశాలను బాగా కుదించి 3 రోజులకు తగ్గించినట్టు తెలుస్తోంది. అలాగే ఇంతకుముందులా ఎవరిని పడితే వారిని సిఫారసులపై అనుమతించరు. చివరకు శాసన సభ్యుల పర్సనల్ సెక్రటరీలు, పర్సనల్ అసిస్టెంట్‌లు, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు కూడా లోనికి అనుమతి లేదని ప్రకటించారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్ని కార్యకలాపాలను నిషేధించారు. ఇది జనం ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో రద్దు చేశారు. శాసన మండలి, శాసన సభ రెండూ కొనసాగుతాయి. చాలామంది శాసన మండలి రద్దయ్యింది అనుకున్నారు. కానీ మండలిని కొనసాగిస్తున్నట్లు తాజా ఆదేశాల ద్వారా స్పష్టమైంది. 

మీడియాకు ఇంకో షాక్ ఏంటంటే.. గతంలో లాబీల్లోకి మీడియా ప్రతినిధులను అనుమతించే వారు. ఇక్కడ మీడియాకు చాలా రహస్యాలు లీకయ్యేవి. ఇపుడదీ నిషేధించారు.