రేపు ఏపీలో ప్రవేశపెట్టే 2 సంచలన చట్టాలివే

February 25, 2020

ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి అనేది బాబు కలగా ప్రచారం చేసి దాని ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నాడు. అన్ని వ్యవస్థల రూపు మార్చి చంద్రబాబు ముద్ర తొలగించడానికి జగన్ శాయశ్శక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం రేపు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది.

  1. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు. 
  2. సీఆర్డీయే పునర్వ్యవస్థీకరణ బిల్లు.

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులో భాగంగా ఏపీకి మూడు కొత్త రాజధానుల ఏర్పాటును ప్రస్తావిస్తున్నారు.  రాజ్యాంగ విభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పెడుతున్నారు. రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి పరిపాలనా సౌలభ్యం ఉండేలా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ జోన్ల పర్యేవేక్షనకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచేయనుంది. ఒక్కో బోర్డులో 9 మంది సభ్యులుంటారు. వీరు అభివృద్ధి ప్రణాళికలు రచిస్తారు. అన్ని బోర్డులకు ముఖ్యమంత్రి ఛైర్మన్. 

ఇక రెండోది సీఆర్డీయే రద్దు చేసి గతంలో వైఎస్ ప్రతిపాదించిన విజయవాడ- గుంటూరు- మంగళగిరి- తెనాలి పరిధిలోని ప్రాంతాలను కలిపి **VGMTUDA**గా పునరుద్దరిస్తారు. అంటే సీఆర్డీయే ఇలా మారిపోతుందని చెప్పొచ్చు. సీఆర్డీయే హక్కులు, బాధ్యతలు అన్నీ దీనికి సంక్రమిస్తాయి. దాని ఆస్తులు, ఉద్యోగులు కూడా దీనికిందకు వస్తారు. సీఆర్డీఏతో జరిగిన అన్ని ఒప్పందాలు మళ్లీ రివైజ్ చేసి VGMTUDA తో చేసుకుంటారు. 

ఈ రెండు బిల్లులు రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి ీ ఈ రెండు బిల్లులు ఆమోదం పొందడం అంటే... అమరావతి రద్దు కావడమే. అయితే, ఈ బిల్లులు శాసనసభ, శాసన మండలి రెండింటిలో ఆమోదం పొందాలి. కానీ శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. మరి ఆ ఆటంకాన్ని జగన్ సర్కారు ఎలా అధిగమిస్తుందో చూడాలి.