ఏం చేసినా జగన్ ఆ పనిచేయలేడు

December 14, 2019

జగన్ ఏమైనా చేయగలడేమో గాని ప్రత్యేక హోదా మాత్రం తేలేడని టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన పార్టీ మార్పుపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏపీకి ప్రత్యేక హోదా బీజేపీ ఉన్నంత వరకు రాదని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రజలను నమ్మిస్తున్న సీఎం జగన్ ఎప్పుడు సాధిస్తారో చెప్పాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని కోరారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా రావడం జరగని పని అన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్ హామీని నమ్మి ఎన్నికల్లో ఆయనను గెలిపించారని, ఆ హామీ ఎప్పుడు ఎపుడు నెరవేరుస్తారో చెప్పాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.
‘హోదా‘ కోసం తమ హయాంలో కేంద్రంపై అన్ని విధాలా పోరాడి విఫలమయ్యామన్నారు. జగన్ పొర్లుదండాలు పెట్టి, తలకిందులా తపస్సు చేసినా కూడా ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వదని ధీమాగా చెప్పారు. తాను ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని అని, తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళతానని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ నుంచి ప్రధాని మోడీ వరకు ఎవరినైనా కలుస్తాను అన్నారు.