బాబు దెబ్బ... జగన్ దొరికిపోయాడు

February 24, 2020

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జగన్ మాట తప్పాడు. మడమ కూడా తిప్పాడు. ఇప్పటికే ఈ విషయం ఏపీ ప్రజలకు తేటతెల్లం కాగా... టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం రాజధాని రైతుల దీక్ష వద్ద చేసిన సుధీర్ఘ ప్రసంగం జగన్ ను నిజంగానే అడ్డంగా బుక్ చేసేసిందనే చెప్పాలి. అమరావతిలో మహాధర్నా నిర్వహిస్తున్న రాజధాని రైతులకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించిన చంద్రబాబు... సోమవారం మధ్యాహ్నం తుళ్లూరు వచ్చి దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  పనిలో పనిగా సెప్టెంబరు 4, 2014లో  వైఎస్ జగన్ అమరావతి విషయంలో అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించి జగన్ ను అడ్డంగా బుక్ చేసిపారేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగం ఇలా సాగింది. "ఆ రోజు అసెంబ్లీలో అమరావతి అంశంపై చర్చ జరిగింది. జగన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.... అధ్యక్షా, విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు చేయడాన్ని మేం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే, మన రాష్ట్రం 13 జిల్లాలతో చిన్న రాష్ట్రంగా మారిపోయింది. ఇంత చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టడం ఇష్టలేక, రాజధానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. మేం మొదటినుంచి చెప్పేదొక్కటే, మీరు క్యాపిటల్ సిటీని ఎక్కడైనా ఏర్పాటు చేయండి కానీ, అక్కడ కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని చెబుతున్నాం... సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డిగారి స్టేట్ మెంట్ ఇది. నేనడుగుతున్నా, ఎందుకు మాట తప్పారు? ఎందుకు మడమ తిప్పారు? ఇది మీరు చెప్పిన మాట కాదా. ఇప్పుడు 200 ఎకరాలు సరిపోతుందని, 500 ఎకరాలు సరిపోతుందని అంటారా? ఎందుకు అమరావతిపై అపవాదులు వేస్తున్నారు? దేనికోసం? మీరే చెప్పారు 30 వేల ఎకరాలు కావాలని. ఇక్కడ రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేశారు. అలాంటి చోట ఆరోపణలు చేస్తారా? 

 

మేమే బినామీ యాక్ట్ తీసుకువచ్చాం, మీకు దమ్ముంటే జ్యుడిషయల్ విచారణ జరిపించి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించాలి! అవినీతికి ఎవరు పాల్పడినా శిక్షించాల్సిందే. కానీ అవినీతి పేరు చెప్పి అమరావతిని చంపేయాలనుకోవడం అన్యాయం, దుర్మార్గం. దమ్ముంటే హైకోర్టు ద్వారా కమిటీ వేసుకోండి. మీరు నియమించుకునే వ్యక్తులు వద్దు. వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. స్పీకర్ దీన్ని ఎడారి అంటారు, మరొకాయన శ్మశానం అంటాడు. బంగారం పండే భూమి ఇది. రైతులు త్యాగాలు చేసి ఇచ్చిన భూమి ఇది. మరొకరు ఇది మునిగిపోతుందంటాడు. చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదు. రాజకీయాలు చేసుకోవాలంటే ఎలక్షన్ల సమయంలో చేసుకుందాం. నాకు కావాల్సింది అమరావతి" అంటూ చంద్రబాబు ఓ రేంజిలో జగన్ సర్కారుపై ఫైరయ్యారు.

 

రాజధానిపై జగన్ మాట తప్పడాన్ని, మడమ తిప్పడాన్ని తనదైన శైలిలో బయటపెట్టేసిన చంద్రబాబు... జగన్ సర్కారుకు నిజంగానే షాకిచ్చారని చెప్పాలి. నవ్యాంద్ర రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు తాము సంకల్పిస్తే... ఆ సంకల్పానికి రైతులు కూడా మద్దతుగా నిలిచి 33 వేల ఎకరాలిస్తే... ఇప్పుడు జగన్ సర్కారు తీసుకుంటున్న దుందుడుకు చర్యల ఫలితంగా రైతుల ఆశలు అడియాశలుగా మారిపోతుండగా... అమరావతి సంకల్పాన్ని జగన్ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. మరి చంద్రబాబు ఇలా అడ్డంగా బుక్ చేస్తే.. దాని నుంచి జగన్ ఎలా బయటపడతారో చూడాలి.