అమరావతికి రాజముద్ర... జగన్ ఆశలు హుళక్కేనా?

February 22, 2020

నిజమే... నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ఇప్పుడు ముక్కలు చేయడం ఎలా సాధ్యపడుతుంది? అది కూడా అమరావతిపై ఏకంగా 2015లోనే... అంటే ఐదేళ్ల క్రితమే అమరావతిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత... ఆ రాజధానిని ఇప్పుడు మూడు ముక్కలు చేయడం సాధ్యపడుతుందా? అయినా కొత్త రాజధాని కోసం అమరావతి రైతులు ఏకంగా 33 వేల ఎకరాల భూములిస్తే... ఆ భూములను వినియోగించుకోకుండా... ఖర్చు పెట్టలేమని చేతులెత్తేసి ఇంకో చోటుకు రాజధానిని తరలిస్తే... అంతా చూస్తూ ఊరుకుంటారా? నిజమే... ఇప్పడు ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై జరుగుతున్న ఈ చర్చలో ఇప్పుడు కేంద్రం ఓ కొత్త అంశాన్ని కూడా వదిలేసింది.

ఏ రాష్ట్ర రాజధానిని అయినా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్కడ పెట్టాలి? ఎలా నిర్మించుకోవాలి? అని నిర్ణయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేసింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంధించిన ప్రశ్నకు సమాదానంగా కేంద్రం మంగళవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. రాజధాని ఎంపిక రాష్ట్ర పరిధిలోనిదేనని చెప్పిన కేంద్రం... నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2015లోనే నోటిఫై చేసినట్టుగా చెప్పింది. ఈ ప్రకటనలో రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదే అయినా... దానిని కేంద్రం నోటిఫై చేయాలన్న కీలకాంశం కూడా ఉన్నది కదా. అంటే... తమ రాజధానిని ఎక్కడైనా పెట్టుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని చెబుతూనే... ఆయా రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలను తాము నోటిఫై చేయాల్సిందే కదా అన్నది కేంద్రం భావన.

నిజమే... రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే కీలక నిర్ణయాలను కేంద్రం నోటిఫై చేయాల్సిందే. అంతేనా.. కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాలు కొత్త రాజధానులను ఏర్పాటు చేసుకుంటే... అందుకయ్యే ఖర్చును కూడా కేంద్రమే భరిస్తోంది కదా. మరి ఏపీ విషయంలోనూ జరిగింది ఇదే కదా. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2014లో నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం హోదాలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దానిని కేంద్రం కూడా నోటిఫై చేసింది. ఆ తర్వాత రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయం, హైకోర్టు భవనం తదితరాలకు కేంద్రం ఏకంగా రూ.2,500 కోట్లను కూడా మంజూరు చేసింది. మరి చంద్రబాబు ప్రకటించిన రాజదానిని కేంద్రం నోటిఫై చేసి... నిధులిచ్చాక కూడా ఇప్పుడు రాజధానిని మూడు ముక్కలు చేస్తానంటే.. కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా?. రాజధాని నిర్ణయంలో తన జోక్యం ఉండదని కేంద్రం చెప్పిన మాటను మాత్రమే పట్టుకుని వేలాడుతున్న వైసీపీ సర్కారుకు... తాను నోటిఫై చేశానన్న విషయాన్ని గుర్తు చేసిన కేంద్రం మున్ముందు చుక్కలు చూపించనున్నదనే వాదన వినిపిస్తోంది.