రాజధాని రైతుల ప్రశ్న.... ఆ ఇద్దరూ ఇప్పుడెక్కడ?

February 22, 2020

నిజమే... ఇప్పుడు రాజధాని రైతుల నోట వినిపిస్తున్న ప్రశ్న ఎటు చూసినా న్యాయంగానే కనిపిస్తోంది. వారేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. కేవలం మొన్నటి ఎన్నికల్లో తమ వద్దకు వచ్చి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓట్లేయమని అడిగారు. వారి మాటలు విని జగన్ కు రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఓటేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా... జగన్ గెలవగానే... జగన్ కు ఓట్లేయని అడిగేందుకు వచ్చిన ఆయన తల్లి వైఎస్ విజయమ్మ గానీ, ఆయన సోదరి షర్మిల గానీ ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. మరి జగన్ కు ఓటేయించేందుకు నాడు కాళ్లకు చక్రాలు కట్టుకున్న మాదిరి ప్రచారం చేసిన విజయమ్మ, షర్మిల... ఇప్పుడు రాజధాని రైతులంతా రోడ్డెక్కి మరీ 20 రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అందుకే... ఇప్పుడు రాజధాని రైతులు జస్ట్ ఆస్కింగ్ అంటూ... విజయమ్మ, షర్మిల ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో జగన్ సీఎం అయ్యారు. ఎన్నికల ప్రచారంలో, అంతకుముందు నిర్వహించిన పాదయాత్రలోనూ జగన్ రాష్ట్ర ప్రజలకు చాలా హామీలే ఇచ్చారు. వాటిలో రాష్ట్ర రాజధానిని అమరావతి నుంిచ తరలించబోనని, అమరావతిలోనే కొనసాగిస్తానన్నది కూడా ప్రధానమైనదే. అయితే గెలుపు దక్కించుకునే దాకా రాజధానిపై అదే తరహా వైఖరిని ప్రదర్శించిన జగన్... సీఎం కాగానే ఆ మాటను మరిచిపోయారు. టీడీపీ ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందన్న ఒకే ఒక్క ఆరోపణను బూచిగా చూపుతూ ఇఫ్పుడు రాజధానిని మూడు ముక్కలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాజధాని రైతులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి.

 

ఈ క్రమంలో ఇప్పుడు రాజదాని రైతులంతా ముక్తకంఠంతో ఒకే ప్రశ్న సంధిస్తున్నారు. జగన్ కు ఓట్టేయించుకోవడానికి నాడు రాజధానిలో పర్యటించి ఓట్లు అడుక్కున్న విజయమ్మ, షర్మిల ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. నాడు ఓట్లేయించుకోవడానికి వచ్చిన సందర్భంగా రాజధాని అభివృద్దికి కట్టుబడి ఉన్నామని చెప్పిన విజయమ్మ, షర్మిల... ఇప్పుడు రాజధానిని జగన్ సర్వనాశనం చేస్తున్నా ఎందుకు నోరు విప్పడం లేదని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. అంతేనా... మాట తప్పం, మడమ తిప్పం అన్న మాటలను పదే పదే వల్లె వేసే షర్మిల గానీ, జగన్ తల్లి విజయమ్మ గానీ... ఇప్పుడు జగన్ మాట తప్పినా, మడమ తిప్పినా... ఎందుకు నిలదీయడం లేదని కూడా రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు.