అమరావతికి ఢోకా లేదా?

February 26, 2020

రాజధాని అమరావతి. మే మునుపటి వరకు ఫుల్ బజ్. పుట్టక ముందే నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి. సింగపూర్ భాగస్వామ్యమే దీనికి కారణం. అందుకే ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాదుతో సమానంగా అక్కడ రియల్ ఎస్టేట్ నడిచింది. రెండు మంచి నగరాల మధ్య ఉండటంతో భవిష్యత్తులో ఎంత పెద్దగయినా విస్తరించడానికి అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో చాలా మంది దానిపై ఆసక్తి చూపారు. భవిష్యత్తును ఊహించే స్థానిక రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. కట్ చేస్తే... బాబు పోయి జగన్ వచ్చారు. అమరావతిని గాలికి వదిలేశారు. ఉద్దేశ పూర్వకంగా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ఢాం అంది. రుణాలు ఆగిపోయాయి. సింగపూర్ తప్పుకుంది. అయినా... ఏపీ సర్కారు హ్యాపీ. కేవలం చంద్రబాబుపై ఇగోతో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కూడా గాలికి వదిలేశారు జగన్. 

ఇదిలా ఉండగా... కేంద్రం ఏపీ మ్యాప్ లో అమరావతిని చూపకపోవడంతో జగన్ కు మోడీ మద్దతు ఉందని అందరూ అనుకున్నారు. అదేదో చంద్రబాబు తప్పు అన్నట్టు ఆనాడు బీజేపీ అధ్యక్షుడు కన్నా ఎగిరెగిరి పడ్డారు. కట్ చేస్తే... జగన్ ఆటలు సాగవు, ఏపీకి రాజధాని అమరావతియే అన్నట్లు కేంద్రం అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్ విడుదల చేసింది. కేవలం అమరావతి కోసమే మ్యాప్ ను రివైజ్ చేసింది. దీంతో రాజధానిపై మిడిసిపడుతున్న ఏపీ ప్రభుత్వానికి ఝలక్ తగిలింది. రాజధాని మారుస్తామంటూ చేసిన హడావుడి ఇక చాలు తగ్గించండి అన్నట్లు కేంద్రం సందేశం పంపినట్లయ్యింది. కొత్త మ్యాప్ విడుదల పై హర్షం వ్యక్తంచేయడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదంటే... ఇది గట్టి దెబ్బే అనుకోవాలి.