అమరావతికి సమాధి... మొదటి పునాది రాయిపడింది

July 07, 2020

ఊహించిందే జరుగుతోంది. జగన్ గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని రాజధానిగా ఉంచరని జరిగిన ప్రచారం గాసిప్ కాదని సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజధాని మార్చడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందని స్వయంగా ఒక మంత్రి చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. అదేదో క్యాజువల్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కాదు. అమరావతి గురించి సాయంత్రం మీడియాతో మాట్లాడుతామని చెప్పి మరీ ఉద్దేశపూర్వకంగా అమరావతి రాజధానికి పనికిరాదు అని కారణాలు వెతికి పట్టుకుని వచ్చి మరీ మీడియాకు చెప్పారు పట్టణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఒకేసారి స్పష్టంగా అమరావతిని మారుస్తామన్న వ్యాఖ్యలు చేస్తే అది ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. అందుకే తమ తప్పేం లేదు... చంద్రబాబుదే తప్పంతా అని నిరూపిస్తు రాజధానిని మార్చడానికి వైసీపీ ప్లాన్ చేస్తోంది. దీనికి పక్కా పథకం వేసుకుంది.
ఆ పథకంలో తొలి దశ... అమరావతి గురించి నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టడం. ఎవరైనా ప్రముఖులు చనిపోతే... ఠక్కున బయటపెట్టకుండా... దశలు దశలుగా జనాలకు అలవాటు చేసినట్టు... అమరావతి పనికిరాదు అని ప్రభుత్వం ప్లాన్ చేసి మరీ ముద్ర వేస్తోంది. తాజాగా వచ్చిన వరదలను అందుకు వాడుకుంటోంది. వరదలు వస్తే అమరావతికి నీళ్లు వస్తాయని ప్రచారం చేస్తోంది. దానిని నమ్మించడానికి పది రోజులుగా ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే... హైదరాబాదుతో సహా దేశంలోని ప్రముఖ నగరాలన్నీ సముద్రాలు, నదుల పక్కనే ఉన్న విషయం గుర్తించాలని ప్రజలు అంటున్నారు. ప్రణాళిక ఉంటే.. ఎలాంటి వరదలు అయిన నియంత్రించుకునే అవకాశం నేటి రోజుల్లో ఉంది. కృష్ణా నదికి అమరావతి ప్రాంతంలో కచ్చితంగా వరద ముప్పు లేదని గత ప్రభుత్వం ఘంటా పథంగా చెప్పి ఆధారాలు బయటపెట్టింది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వరద ముప్పు ఉందని చెప్పడానికి గట్టిగా ప్రయత్నం చేస్తోంది.

అమరావతి గురించి ప్రభుత్వం చెప్పిన ప్రతికూల కారణాలు ఏంటి?
1. కృష్ణా వరద ముప్పు అమరావతికి ఉంది.
2. ఇతర ప్రాంతంతో పోలిస్తే అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించడం వల్ల ఎక్కవ ఖర్చు అవుతుంది. వరద నీటి మేనేజ్ మెంట్ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది
3. మూడు పంటలు పండే భూముల్లో రాజధాని కడితే అది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి?
1. అమరావతి భూములు అన్నీ తెలుగుదేశం పార్టీ వారి కనుసన్నల్లో ఉన్నాయి. అమరావతి అభివృద్ధి చేస్తే తెలుగుదేశం ఆర్థిక మూలాలు బలపడతాయి.
2. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగన్ సామాజిక వర్గం ప్రభావం తక్కువ... వైసీపీకి పట్టున్న ప్రాంతంలో రాజధాని పెడితే ఉపయోగకరంగా ఉంటుంది.

జనాలు ఏమనుకుంటున్నారు?
1. 2014 ఎన్నికల్లో గెలుస్తామని వైసీపీ భావించి దొనకొండ లో భారీగా భూములు కొన్నారు. అక్కడికి తరలిస్తే పార్టీ మూలాలు బలపడతాయని ప్రచారం.
2. అమరావతిని అభివృద్ధి చేసినా ఆ క్రెడిట్ చంద్రబాబుకే వెళ్తుంది, కాబట్టి జగన్ దాన్ని పట్టించుకోరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
3. కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీ అధినేత సామాజిక వర్గం లేదు కాబట్టి... కమ్మ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టడానికి అమరావతిని అణిచివేస్తుండొచ్చని జనం గుసగుస.