జేసీ మాట... జగన్ తెగించాడు

November 10, 2019

ఏదైనా కొట్టినట్లు మాట్లాడే రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి. జగన్ పాలనపై చెప్పేదేమీ లేదు, ఇంకో ఆర్నెల్ల తర్వాత ఏదైనా చెప్పగలను అని వ్యాఖ్యానించాడు జేసీ. జగన్ తెగించి తనకు నచ్చింది చేస్తున్నాడని... ఎవరి మాటా పట్టించుకోవడం లేదని... దానివల్ల మంచి ఎంత జరుగుతుందో, చెడు కూడా అంతే జరుగుతోందని అన్నారు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు జగన్ పాలన సాగుతోందని... చూద్దాం ఏడాది తర్వాత ఏం జరుగుతుందో అన్నారు. 

మరోవైపు జగన్ అడిగితే సలహాలు ఇస్తానని సంచలన వ్యాఖ్య చేశారు జేసీ. ఒక్క నిమిషం ముందు జగన్ ఎవరి మాట వినడని తనే స్వయంగా చెప్పిన జేసీ... అంతలోనే అడిగితే సలహాలు ఇస్తానని చెప్పడం ఒక ట్విస్టు. జగన్ కి అనుభవం తక్కువ అని, మోడీ మంత్రదండం వల్ల జగన్ గెలిచాడని... జేసీ అన్నారు. 

రాజధానిపై జేసీ కుండ బద్దలు కొట్టారు. అమరావతి ని అక్కడికీ ఇక్కడికీ మారుస్తారని అంటున్నారని... అమరావతి ఎక్కడికీ పోదని... ఇక్కడే ఉంటుందని జేసీ చెప్పారు. అది మార్చడం అంత సులువు కాదని, జగన్ దాని జోలికి పోరు అన్నారు.