నోరెత్తితే దాడులే... మరో మీడియాపై జగన్ కక్షసాధింపు

August 14, 2020

ఏపీ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన నాడే... మీడియా సంస్థలను భయభ్రాంతులకు గురి చేసేలా సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... చేతల్లోనే అదే తరహా దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే టీవీ5 మూర్తిపై ఏకంగా కేసులు పెట్టేసి ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన జగన్ సర్కారు... ఇప్పుడు మరో మీడియా సంస్థను టార్గెట్ చేసింది. తనపై వ్యతిరేక కథనాలు రాస్తున్నారంటూ ఇప్పటికే పలు పత్రికలు, టీవీ ఛానెళ్లకు ప్రకటనలను ఆపేసి కక్ష సాధింపులకు దిగిన జగన్... తాజాగా తనపై వ్యతిరేక కథనాలను రాస్తోందంటూ ఓ వెబ్ సైట్ పై ఏకంగా సీఐడీతో దాడులు చేయించారు. అంతేకాకుండా సదరు మీడియా సంస్థకు కోర్టుకు వెళ్లేందుకు ఎంతమాత్రం అవకాశం లేకుండా చేసేలా పకడ్బందీగా ప్రణాళిక రచించి జగన్ సర్కారు సీఐడీ చేత గురువారం రాత్రి వ్యూహాత్మంగా దాడులు చేయించారు. 

తెలుగు వన్...విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అభిరుచులకు అనుగుణంగా వర్ధమాన వార్తలు, సినిమా సంగతులు, ఆధ్మాత్మిక విషయాలపై కథనాలు, వీడియోలను ప్రచురించేందుకు ఏర్పాటైన వెబ్ సైట్. ఏళ్ల తరబడి కొనసాగుతున్న తెలుగు వన్ దినదిన ప్రవర్ధమానంగానే ఎదిగింది. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో రాజకీయాల పరంగానూ ఓ మోస్తరు వార్తలను పెంచేసింది. ఈ క్రమంలో జగన్ సర్కారు తీసుకున్న పలు విధాన పరమౌన నిర్ణయాలపైనా తెలుగు వన్ పలు వార్తా కథనాలను ప్రచురించిందట.

ఈ క్రమంలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందంటూ తెలుగు వన్ పై జగన్ సర్కారు ఓ భావనకు వచ్చేసిట్టుగా వార్తలు వినిపించాయి. చాలా కాలంగా ఈ వెబ్ సైట్ పై ఓ కన్నేసి ఉంచిన ఏపీ ప్రభుత్వం... గురువారం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంపై దాడులకు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. జగన్ సర్కారు నుంచి ఆదేశాలు రాగానే తెలుగు వన్ కార్యాలయంపై విరుచుకుపడిన సీఐడీ అధికారులు.. సంస్థకు చెందిన ఓ కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సంస్థకు చెందిన మరింత మంది సిబ్బందినీ అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేకాకుండా కోర్టుకు నాలుగు రోజుల సెలవు ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ కోర్టును ఆశ్రయించకుండా ఉండేలా.. గురువారం కోర్టు వేళలు ముగిసిన తర్వాత సీఐడీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.