మాస్కు వేస్కోమంటే... ఏపీ ప్రజలందరూ ఆయనకు చెప్పమంటున్నారట

August 05, 2020

కోట్లాది మంది ప్రజలు ఏమేం చేయాలన్న విషయాల్ని చెప్పే ప్రభుత్వాలు.. ముందు అలాంటి వాటిని తమకు తాముగా అమలు చేస్తే మరింత బాగుంటుంది.

మొన్నటివరకూ అక్కడ అమెరికా అధ్యక్షుడు.. ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి తప్పించి ప్రతి ఒక్కరు మాస్కు పెట్టుకునే వారే అన్న మాట తరచూ వినిపించేది.

ఈ మధ్యన పెరిగిపోతున్న కేసుల దెబ్బకు ట్రంప్ సైతం ముఖానికి మాస్కు పెట్టేసుకున్నారు. అప్పటికి అదో వార్తగా మారింది. ట్రంప్ ఏంటి? ముఖానికి మాస్కు పెట్టుకోవటమా? అని ఆసక్తిగా చూసినోళ్లు బోలెడంతమంది.

ఎందుకో చెప్పరు కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖానికి మాస్కు పెట్టుకోవటం అస్సలు నచ్చదు.

ఆ మాటకు వస్తే ఆయనే కాదు.. ఆయన వెంట ఉన్న వారి ముఖానికి కూడా మాస్క్ లేకుండా ఉండటం కనిపిస్తుంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లోని కుటుంబ సభ్యులు తప్పించి మరెవరూ లేనప్పుడు తప్పించి.. మిగిలిన అన్ని సందర్భాల్లో మాస్కుల వినియోగం చాలా అవసరమన్న మాట తరచూ వినిపిస్తోంది. అయితే.. ఏపీ సీఎం జగన్ మాత్రం అలాంటివేమీ తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

తాజాగా ఏపీలో మాస్కు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్కుధరించటం తప్పనిసరిగా చేస్తూ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

బహిరంగ ప్రదేశాల్లోనూ.. పని చేసే ప్రదేశాలతో పాటు ప్రయాణ సమయాల్లోనూ ముఖానికి మాస్కు తప్పనిసరిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

మాస్కులు ధరించటం ఒక అలవాటుగా చేయాలని పోలీసు.. రెవెన్యూ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ కోరింది. కోట్లాది మంది ప్రజలకు అవగాహన కల్పించటానికి ముందు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పటికైనా ఆయన ముఖానికి మాస్కు పెట్టుకోవటం ద్వారా తనకు తాను భద్రత కల్పించటంతో పాటు.. ఎదుటి వారికి సైతం మేలు చేస్తున్నానన్న విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని పలువురు వాపోవటం గమనార్హం.