అమెరికాలో ఉన్న జగన్ ఏం చేశారంటే...

August 07, 2020

వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆయన హాజరైన సమావేశాల్లో ఆయనేం మాట్లాడారు? ఇతర వక్తలు ఏపీలోని జగన్ ప్రభుత్వం మీద ఎలా రియాక్ట్ అవుతున్నారు? లాంటి అంశాల్ని చూస్తే.. జగన్ ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలోని ఉన్నారు. ఆయన డుల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగగా.. ఆయనకు స్వాగతం పలికేందుకు భారత రాయబార కార్యాలయం సీనియర్ అధిరారులు హాజరై సీఎంకు స్వాగతం పలికారు. జగన్ కు స్వాగతం పలికిన వారిలో రాయబార కార్యాలయ అధికారులతో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఇస్మా (ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ) లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి పలువురు పారిశ్రామికవేత్తలతో హాజరయ్యారు. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించినకార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత.. పారదర్శక ప్రభుత్వం తమదని.. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న వారికి ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు. ఏపీలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారు కేవలం ఒక్క అప్లికేషన్ పెడితే సరిపోతుందన్నారు. అప్లికేషన్ పెట్టటం తరువాయి.. తన కార్యాలయమే అన్ని విషయాలు చూసుకుంటుందన్నారు.
పారిశ్రామికవేత్తలకు.. పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండటమే కాదు.. వారికి చేయూతనిస్తుందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి అవసరమైన భూములు.. విద్యుత్.. నీరు లాంటి అన్ని సౌకర్యాలు.. సదుపాయాల్ని ప్రభుత్వం చూస్తుందన్నారు. సదస్సుతో పాటు యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ సమావేశంలోనూ సీఎం మాట్లాడారు.
ఏపీ ప్రత్యేకతల గురించి చెప్పిన జగన్.. విశాలమైన సముద్ర తీరం ఉందని.. కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చటం.. మెట్రోరైళ్లు.. బకింగ్ హామ్ కెనాల్ పునరుద్దరణ.. ఎలక్ట్రికల్ బస్సులు.. వ్యవసాయ స్థిరీకరణ.. నదుల అనుసంధానం.. వ్యవసాయ రంగంలో పరిశోధనలు.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విస్తరణ.. అక్వా తదితర రంగాల్లో అవకాశాలు భారీగా ఉన్నట్లు చెప్పారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబ్ ష్రోడర్ మాట్లాడుతూ..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ సాధించిన విజయాన్ని ప్రస్తావించటం గమనార్హం. యూఎస్ లో భారత రాయబారి హర్షవర్దన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైఎస్ జగన్ సాధించిన మెజార్టీ చారిత్రకంగా అభివర్ణించారు.