ఏపీలో మంత్రులంతా జీరోలే... అంతా జగన్ మయం !!

August 07, 2020
CTYPE html>
ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన మంత్రివర్గ కూర్పును చాలా ఘనంగా ప్రకటించుకున్నారు. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని వర్గాలకు తన కేబినెట్ లో చోటు కల్పిస్తున్నానని, బడుగు, బలహీన వర్గాలు, కాపులు... ఇలా ఐదు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తున్నట్లుగా కూడా జగన్ జబ్బలు చరుచుకున్నారు. చెప్పినట్టుగానే తన కేబినెట్ లో ఆయా వర్గాలకు చెందిన ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన జగన్.. సామాజిక న్యాయం పేరిట దాదాపుగా మెజారిటీ వర్గాలకు మంత్రి పదవులు కల్పించారు. ఇక్కడిదాకా బాగానే ఉంది గానీ... మరి డిప్యూటీ సీఎం, మంత్రులుగా మారిన వైసీపీ ఎమ్మెల్యేలు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటే... మాత్రం సమాధానం ఠక్కున వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
జగన్ కేబినెట్ లో మొత్తం ఐదుగురు మంత్రులు, 20 మంది మంత్రులు ఉన్నా... ఏ ఒక్కరు కూడా తమ శాఖలకు చెందిన నిర్ణయాలను తీసుకోవడం లేదట. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా... స్వయంగా జగనే ఆయా శాఖల సమీక్ష సందర్భంగా తీసుకుంటున్నారట. ఆయా శాఖల మంత్రులుగా కొనసాగుతున్న వైసీపీ మంత్రులకు అసలు తమ శాఖల్లో ఏం జరుగుతుందన్న విషయంపైనా స్పష్టత ఉండటం లేదట. నేరుగా అధికారులను తన వద్దకే పిలిపించుకుంటున్న జగన్... ఆయా శాఖల్లో తీసుకురావాల్సిన సంస్కరణలు, కీలక నిర్ణయాలన్నింటిపై తానే డెసిషన్ తీసుకుంటున్నారట. అంటే... ఏదో సామాజిక న్యాయం పేరిట తన కేబినెట్ లో అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పించానని చెబుతున్న జగన్... సదరు మంత్రుల నోళ్లకు ప్లాస్టర్లు వేసేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 
ఇదే విషయాన్ని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ చాలా విస్పష్టంగానే విప్పేశారు. ఆదివారం జగన్ సర్కారు పనితీరుపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా జగన్ కేబినెట్ లో ఏం జరుగుతోంది? అసలు మంత్రులకు స్వేచ్ఛ ఉందా? అన్న వివరాలపై ఆయన సంచలన విషయాలనే చెప్పేశారు. జగన్ కేబినెట్ లో మంత్రులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని రామకృష్ణ ఆరోపించారు. అన్ని శాఖలకు చెందిన అన్ని నిర్ణయాలు జగనే తీసుకుంటున్నారని, అంతా జగన్ మయం అయిపోయిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెరసి రాష్ట్రంలో ఏకపక్ష, ఏక వ్యక్తి పాలన సాగుతోందని ఆయన విరుచుకుపడ్డారు. మొత్తంగా జగన్ చెప్పిన సామాజిక న్యాయం మాట బుట్ట దాఖలైందని, మంత్రులంతా కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని ఆయన తేల్చేశారు.