‘‘నో డౌట్... జగన్ ఓ తుగ్లక్ సీఎం’’

May 31, 2020

నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తీవ్ర అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పాలి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంతకాలం పరిస్థితులన్నీ సాఫీగా సాగగా... మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. తాజాగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి పీక పిసికేసేలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిపోయింది. మొత్తంగా రాష్ట్రంలో తీవ్ర అల్లకల్లోల, ఉద్రిక్త పరిస్థితులకు కారణం సీఎం జగనేనని చెప్పక తప్పదు. అంతేకాకుండా తలాతోకా లేని రీతిలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను మేథావి వర్గం తీవ్రంగానే ఎండగడుతోంది. జగన్ తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒక్కటంటే ఒక్క నిర్ణయానికి కూడా సహేతుక కారణాన్ని కూడా వినిపించలేని పరిస్థితిలో ఉన్నారన్న వాదనలూ పెరిగిపోయాయి. మొత్తంగా జగన్ ను మేథావి వర్గం ఓ పిచ్చి తుగ్లక్ గా ముద్ర వేసేసిందనే చెప్పాలి. 

ఇలాంటి క్రమంలో ఏపీకి మూడు రాజధానుల పేరిట అమరావతిని నామరూపాల్లేకుండా చేసేలా జగన్ తీసుకున్న నిర్ణయంపై మేథావి వర్గం ఓ రేంజిలో విశ్లేషణలను వదులుతోంది. ఇలాంటి విశ్లేషణల్లో భాగంగా... విజయవాడకు చెందిన ఓ సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వెలువరించిన విశ్లేషణ ఆసక్తి రేకెత్తిస్తోంది. అసలు జగన్ మూడు రాజధానులను ఎందుకు కలవరిస్తున్నారన్న విషయంతో పాటుగా అమరావతిని అడ్రెస్ లేకుండా చేసే దిశగా జగన్ చాలా క్లారిటీగానే వెళుతున్నారని సదరు జర్నలిస్టు ఆరోపించారు. అంతేకాకుండా జగన్ తీసుకుంటున్న ఏ ఒక్క నిర్ణయానికి కూడా సహేతుక కారణం లేదని కూడా ఆయన తనదైన శైలి విశ్లేషణ చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించడం, దాని అభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వం చేసిన కసరత్తు... ఆ తర్వాత ఇప్పుడు జగన్ వినిపిస్తున్న మూడు రాజధానుల వాదన... ఇలా మొత్తం ఎపిసోడ్ ను సదరు జర్నలిస్టు వివరించారు. ఆ విశ్లేషణలోకి వెళ్లిపోదాం పదండి.

ఏపీకి మూడు రాజధానులను ఎందుకు ఏర్పాటు చేస్తున్నానన్న విషయంపై జగన్ కే క్లారిటీ లేదట. ఎందుకంటే... రాజధాని ఒక్కటే ఉన్నా... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కూడా ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించాల్సిందే. ఎందుకంటే... ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా... కేవలం ఆ ప్రభుత్వ పరిధి రాజధాని వరకు మాత్రమే కాదు కదా. రాష్ట్రం మొత్తానికి కూడా ఆ ప్రభుత్వమే దిక్కు కదా. అలాంటప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తేనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్న వాదనలో పస ఏముంది? ఇక జగన్ చెబుతున్న అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయానికి వచ్చినా... విచారణ చేసి తప్పు తేలితే... బాధ్యులపై చర్యలు తీసుకునే అధికార దండం జగన్ చేతిలోనే ఉంది కదా. తప్పులను తేల్చే విషయాన్ని పక్కనపెట్టేసి... ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామంటే ఎలా? 

ఇక.. రాజధాని నిర్మాణానికి తన వద్ద డబ్బు లేదని చెబుతున్న జగన్.. మరి అమరావతిలో ఇప్పటికే నిర్మాణం పూర్తి అయి కార్యకలాపాలు కూడా సాగిస్తున్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను తర్వాత ఏం చేయాలి? ఈ మూడింటితో పాటు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధుల గృహాలు రూ.500 కోట్లతో పూర్తి చేయవచ్చు కదా. అంటే... ఇంకో రూ.500 కోట్టు ఖర్చు చేస్తే... రాజధాని కోసం అమరావతిలో సింగిల్ పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదా. అదే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖకు తరలిస్తే... రూ.500 కోట్ల కంటే కూడా మరింతగా ఖర్చు చేయాల్సిందే కదా. జ్యూడిషియల్ కేపిటల్ కర్నూలులో కనీసం హైకోర్టు, జడ్జీల కోసం నివాసాలైనా ఏర్పాటు చేయాలి కదా. మరి అమరావతిలో రాజధాని నిర్మాణాని డబ్బు లేకపోతే... విశాఖ, కర్నూలులో కొత్త నిర్మాణాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. సో.. మూడు రాజధానులపై జగన్ వినిపిస్తున్న ఏ ఒక్క వాదనకు కూడా సహేతుక కారణమే లేదని తేలిపోయినట్టే కదా. అందుకే జగన్ ను మేథావి వర్గం పిచ్చి తుగ్లక్ గా అభివర్ణిస్తోంది.