జగనన్నకు కరోనా లేటెస్ట్ షాక్ ఇదే

August 03, 2020

ఏపీ కరోనా కేసుల బులిటెన్ మీరు రోజూ గమనిస్తారా? ఒకవేళ గమనిస్తే... అందులో మీరు ఒక గమ్మత్తయిన విషయం గుర్తించి ఉండాలి. అదేంటంటే... అన్ని చోట్లా కరోనా కేసులు పెరుగుతాయి కానీ విశాఖలో కేసులే పెరగవు. ప్రపంచంలో ఏ ఒక్క నగరాన్ని వదలని కరోనాకు విశాఖపై ప్రత్యేక దయ ఎందుకుంటుంది? రూరల్ కంటే కచ్చితంగా పట్టణాల్లో, పట్టణాల కంటే నగరాల్లో కచ్చితంగా కేసులు ఎక్కువున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే నడుస్తోంది. ఒక్క విశాఖలో తప్ప. ఎందుకిలా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజధానిగా దానిని ఇష్టపడ్డారు కాబట్టి అందులో కరోనా పెరగదు. అంతే... ఎందుకు అని అడగొద్దు. ఒక్క నిమిషం ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది.

అయితే, ఇంతకాలం చాలా ప్రయత్నం చేశారు గాని... ఎందుకో ఈరోజు వైజాగ్ లో కరోనా పుట్ట పగిలింది. ఇక ప్రయత్నం చేయడం అనవసరం అనుకున్నారేమో... ఒక్కసారిగా కేసులు కనిపించేశాయి. ఈ ఒక్కరోజే విశాఖపట్నంలో 1049 కేసులు నమోదయ్యాయి. కరోనా చరిత్రలో విశాఖపట్నంలో ఇది ఆల్ టైం రికార్డు. నిన్నటి వరకు కేసుల సంఖ్యలో కింద నుంచి రెండో స్థానంలో ఉన్న విశాఖ... ఇపుడు టక్కున ఎగబాకింది. కరోనా మాత్రం ఎంతకాలమని జగన్ మాట వింటుంది చెప్పండి. 

ఇక ఈరోజు బులిటెన్ లో అనేక సంచలనాలున్నాయి. 6045 కేసులు నమోదయ్యాయి. ఇదే ఇప్పటివరకు ఏపీలో అత్యధికం. మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి.  ఒక్కరోజే 65 మంది మరణించారు.  గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. కృష్ణా జిల్లాలో 10, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 5 చొప్పున, విజయనగరం జిల్లాలో 4, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో చెరో ముగ్గురు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈరోజు రికవరీ కూడా రికార్డు సృష్టించిది. నమోదైన కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువ. ఒక్క రోజులో 6494 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 64,713కి పెరిగింది. వీరిలో  823మంది ప్రాణాలు కోల్పోగా.. 32,127 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 31,763 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.