సెలక్ట్ కమిటీ ఇష్యూ: కార్యదర్శిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చైర్మన్

April 06, 2020

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు, శాసన మండలి రద్దు అంశాలు ఏపీ రాజకీయాల్లో వేడిని రాజేస్తున్నాయి. సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న మండలి చైర్మన్ షరీఫ్ ప్రతిపాదనకు కార్యదర్శి షాకిచ్చారు. మంగళవారం కార్యదర్శి అంశాన్ని షరీఫ్ గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. మండలిలో జరిగిన పరిమాణాలపై వివరించారు. సెలక్ట్ కమిటీ ఏర్పాటులో కార్యదర్శి తీరుపై ఫిర్యాదు చేశారు.

చైర్మన్ ఆదేశాలను పాటించలేదని, సెలక్ట్ కమిటీపై రెండుసార్లు ఫైల్ పంపిస్తే తిప్పి పంపించారని గవర్నర్‌కు తెలిపారు. దురుద్దేశ్య పూర్వకంగానే సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై తన ఆదేశాలను ఉల్లంఘించారన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం షరీఫ్ మాట్లాడుతూ.. తాను మండలిలో జరిగిన వ్యవహారాలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లానని, అలాగే సెలక్ట్ కమిటీ విషయంలోనూ సెక్రటరీ తీరును గవర్నర్‌కు వివరించానని చెప్పారు.

రూలింగ్‌ను అమలు చేయలేదని చెప్పానన్నారు. చైర్మన్ ఆదేసాలను కాదని గతంలో చెప్పిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే సెలక్ట్ కమిటీ ఏర్పాటయినట్లు చెప్పారు. ఆదేశాలు పాటించనందున కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. చైర్మన్‌గా తన ఆదేశాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు సంబంధించి సెలక్ట్ కమిటీ ఏర్పాటులో జోక్యం చేసుకోవాలని, మండలి నిర్ణయాలకు అనుగుణంగా కార్యదర్శి వ్యవహరించేలా చూడాలని కోరారు. మండలి కార్యదర్శి, ఆయన సిబ్బంది తనకు సహకరించడం లేదన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు మండలి చైర్మన్ నాలుగు పేజీల లేఖను అందించారు. అలాగే, కార్యదర్శి పంపిన నోట్ ఫైల్‌ను జత చేశారు.