జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగే షాకే ...

February 22, 2020

మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై మండలిలో ఉత్కంఠ పరిస్థితి కొనసాగి ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై మండలిలో మండలి చైర్మన్ షరీఫ్ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. దీనిపై టీడీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేయగా... వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఏకంగా, బ్లాక్ డే కంటే ఘోర‌మైన ప‌రిస్థితి అని వైసీపీ ఆరోపించింది.
రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఆపకుండా శాయశక్తులా ప్రయత్నించింది. సెలక్ట్ కమిటీకి వెళ్లాలని టీడీపీ, అవసరం లేదని వైసీపీ రెండ్రోజుల పాటు వాగ్వాదం చేసినా చివరకు మెజార్టీ సభ్యుల వాదనే నెగ్గింది. తనకున్న విచక్షణాధికారాలతో బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. కాగా, సెలక్ట్ కమిటీకి బిల్లును తిరస్కరించే అధికారం లేకపోయినా ప్రభుత్వానికి సూచనలు చేసే ఛాన్స్ ఉంది. కాగా, రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో, రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మందడం రహదారిపైకి జాతీయ జెండాలతో వచ్చి సేవ్‌ అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించి బిల్లు సెలెక్ట్ కమిటీ బాట పట్టింది. అయితే, ఈ బిల్లు విషయంలో ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారిపై అనర్హత వేటు వేయడానికి టీడీపీ సిద్ధమౌతోంది. కాగా, మండలి ఛైర్మన్ తీరుపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. ఛైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని, ఈరోజు ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే కంటే ఘోరమైన రోజని అభిప్రాయపడింది. టీడీపీ అన్ని విలువలకు తిలోదకాలిచ్చిందని, టీడీపీ అధినేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని ఛైర్మన్‌ను ప్ర‌భావితం చేశారని వైసీపీ మంత్రులు ఆరోపించారు.