ఛీ..ఛీ.. ఏపీ మండలిలో కొట్టేసుకున్నారు

August 07, 2020

ఏపీ మండలి సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ చట్టసభల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు.. ఆరోపణలు చేసుకోవటం స్థాయి నుంచి ఘాటుగా తిట్టుకోవటం వరకూ వెళ్లిన వైనం తెలిసిందే.

తాజాగా మరో అడుగు ముందుకు పడి..అధికార.. విపక్షాలు కొట్టుకునే వరకూ వెళ్లటం షాకింగ్ గా మారింది. ఏపీ మండలిలో అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధం నుంచి ముష్టి యుద్ధాలకు పరిస్థితి వెళ్లటానికి కారణం ఏమిటన్నది చూసినప్పుడు.. అపనమ్మకం.. అనుకోకుండా చోటు చేసుకున్న పరిణామాలే కారణంగా కనిపిస్తాయి.

మండలిలో ఏ అంశాన్ని ముందుగా చర్చించాలన్న దానిపై పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్న వేళలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జరిగింది జరిగినట్లుగా చెప్పాల్సి వస్తే.. రూల్ 90పై ఓటింగ్ జరగాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతూ నినాదాలు చేశారు.

వీరికి మాజీ మంత్రి లోకేశ్ జత కలిశారు. విపక్ష టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంటూ.. మంత్రులు.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేశారు.

ఇదే సమయంలో లోకేశ్ రెండు చేతులు పైకెత్తి పోడియం వైపు చూస్తున్న వేళ.. ఆయన చేతుల్లో సెల్ ఫోన్ కనిపించింది. ఫోటోలు తీస్తున్నట్లుగా భావించారు. దీనికి తగ్గట్లే మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సైతం లోకేశ్ ను ఫోటోలు తీయొద్దని మైకులో చెప్పారు. పోడియం చుట్టుముట్టిన తమను లోకేశ్ ఫోటోలు తీస్తున్నారని భావించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. లోకేశ్ పైకి దూసుకొచ్చారు.

లోకేశ్ పై దాడికి మంత్రి వెల్లంపల్లి ప్రయత్నిస్తున్నారని భావించిన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అనూహ్యంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో అనుకోని రీతిలో బల్ల తగిలి మంత్రి వెల్లంపల్లి కిందకు పడిపోయారు.

తనను కిందికి తోయటంతోనే తాను పడినట్లుగా భావించిన మంత్రి వెల్లంపల్లి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సినీ ఫక్కీలో బీద రవిచంద్రను ఎగిరి తన్నారు. దీంతో బీద రవిచంద్ర సైతం మంత్రిని తన్నారు.

దీంతో మండలిలో పరిస్థితి ఒక్కసారి మారిపోయింది. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి అవంతి శ్రీనివాస్ వేగంగా స్పందించి మంత్రి వెల్లంపల్లిని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. టీడీపీకి చెందిన దీపక్ రెడ్డి తదితరులు బీద రవిచంద్రను వెనక్కు తీసుకెళ్లారు.  

ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన సభ్యులు ఘాటుగా తిట్టుకున్నారు. వారి తిట్లు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని మహిళా ఎమ్మెల్సీలు వెల్లడిస్తూ.. తాము వినలేని స్థాయిలో బూతులు తిట్టుకున్నారని వాపోయారు.

ఇదిలా ఉంటే.. తాను సెల్ ఫోన్ తో ఫోటోలు తీయలేదని లోకేశ్ స్పష్టం చేశారు. అయినా.. చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని.. నినాదాలు చేయడంతో చూసినోళ్లు ఎవరైనా ఫోటోలు తీస్తున్నారన్న భావనే కలుగుతుందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లు.. డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహణ్యం ఫోటోలు తీయొద్దని మైకులో చెప్పటమే నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.