కౌన్సిల్ రద్దా?... అంత సీనే లేదంటబ్బా

February 22, 2020

ఏపీలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంటుందని అంతా అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీ శాసన వ్యవస్థలో ఎన్టీఆర్ హయాంలో రద్దైపోయి... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మళ్లీ పురుడుపోసుకున్న శాసనమండలిని ప్రస్తుత జగన్ సర్కారు రద్దు చేస్తుందన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ లేకున్నా కొందరేమో శాసనమండలి రద్దు ఖాయమేనని చెబుతుంటే.. మరికొందరేమో మండలి రద్దు సమస్యే లేదని వాదిస్తున్నారు. ఈ రెండో వాదననే వినిపించిన టీడీపీ కీలక నేత, ఆ పార్టీ తరఫున కౌన్సిల్ లో సభ్యుడిగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న... మండలి రద్దు సమస్యే లేదని వాదిస్తున్నారు.

ఈ వాదనకు బుద్దా చెబుతున్న రీజన్స్ కూడా సహేతుకంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఆదివారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్బంగా బుద్ధా వెంకన్న తన వాదనను చాలా స్పష్టంగానే వినిపించారు. అయినా బుద్ధా ఏమన్నారంటే... ‘‘మండలి రద్దు దిశగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ కేవలం బెదిరింపులు మాత్రమే. జగన్ బెదిరిస్తున్నారే తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ మండలిని రద్దు చేయరు. టీడీపీ ఎమ్మెల్సీలు లేకపోతే రాష్ట్రం ఇప్పటికే ముక్కలయ్యేదన్న భావన ప్రజల్లో ఉంది. వైసీపీలో ఎంతోమందికి ఎమ్మెల్సీ పదవులిస్తామని చెప్పారు. బల్ల గుద్ది చెబుతున్నా... మండలిని రద్దు చేయరు’’ అని బుద్ధా ధీమా వ్యక్తం చేశారు. 

బుద్ధా వ్యాఖ్యలు ఎలా ఉన్నా... మండలి రద్దు అంశంపై జగన్ అడుగులు ఎలా ఉన్నా... ఏపీ శాసనమండలి రద్దు అవుతుందా? లేదా? అన్న విషయంపై సోమవారం రాత్రికి గాని క్లారిటీ రాదు. ఎందుకంటే.. సోమవారం నాటి శాసనసభా సమావేశాల్లో మండలి అవసరమా? లేదా? అన్న విషయంపై సుదీర్ఘ చర్చ జరగనుంది. ఆ తర్వాత సోమవారం రాత్రికి కేబినెట్ సమావేశం జరగనుంది. అదే సమయంలో మండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై మండలిలో ఏ తరహా పరిణామాలు చోటుచేసుకుంటాయన్న విషయంపైనే మండలి రద్దు అంశం ఆధారపడి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి బుద్దా వాదన మేరకు మండలి రద్దు కాదో? లేదంటే రద్దు అవుతుందో? సోమవారం రాత్రికి గానీ తేలదన్న మాట.