డేంజర్ లో జగన్... ఈ డిప్యూటీ సీఎమ్మే కారకుడు

June 02, 2020

విశ్వవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై ఓ రకమైన ఆందోళన ఉంటే... ఏపీలో మాత్రం ఈ తరహా ఆందోళన ఇంకోలా ఉందని చెప్పాలి. విదేశాల నుంచి ఇటీవలి కాలంలో రాష్ట్రానికి వచ్చిన వారిలో కొందరు కరోనా పాజిటివ్ గా తేలితే.. వారికంటే కూడా ఎక్కువ స్థాయిలో ఢిల్లీలోని మర్కజ్ కు మత ప్రార్థనలకు వెళ్లిన వారే అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఓ రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఈ భయాందోళనలను మరింత పెంచేలా తాజాగా ఓ ఘటన వెలుగు చూసింది. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా... ఏకంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే కరోనాను అంటించేస్తారా? అన్న దిశగా జరుగుతున్న చర్చ ఇప్పుడు కొత్త ఆందోళనలను రేకెత్తించింది.

ఇతర ముస్లిం సోదరుల మాదిరే... డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చారట. అయితే ఇటీవల మర్కజ్ లో జరిగిన భారీ సమావేశాలకు ముందే అక్కడికి వెళ్లి వచ్చిన బాషా... తనకు కరోనా సోకిందా? లేదా? అన్న దిశగా పెద్దగా దృష్టే సారించలేదట. అంతేకాకుండా మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన మరునాడే ఆయన ఏకంగా పలువురు ముస్లిం మత పెద్దలతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారట. అంతేనా... ఆ తర్వాత కూడా బాషా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే జగన్ నిర్వహిస్తున్న భేటీలకు వరుసగా హాజరవుతున్నారు. 

ఈ క్రమంలో మర్కజ్ నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడుతుండటం, అదే సమయంలో సదరు బాదితుల కుటుంబ సభ్యులకు కూడా కరోనా అంటుకుంటూ పోతున్న నేపథ్యంలో ఇప్పుడు అంజాద్ బాషా కారణంగా జగన్ కు కరోనా సోకే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ దిశగా వార్తలు వస్తున్నా... అటు అంజాద్ బాషాలో గానీ, ఇటు సీఎం జగన్ మోహన్ రెడ్డిలో గానీ ఎలాంటి ఆందోళన కనిపించడం లేదు. ఏదేమైనా కరోనా వేళ... రాష్ట్ర ప్రజలను పెను ముప్పు నుంచి కాపాడే దిశగా నిత్యం సమీక్షలతో బిజీబిజీగా ఉన్న జగన్ కు బాషా మర్కజ్ పర్యటనపైనా కాస్తంత దృష్టి సారించి ఆయనకు తక్షణమే వైద్య పరీక్షలు చేయించాలన్న వాదన వినిపిస్తోంది.