నిరసనకారుల చేతుల్లో పోలీసు లాఠీలా?

February 26, 2020

డీజీపీయా.. వైసీపీ కార్యకర్తా?
మాజీ సీఎంపై చెప్పులేయడం నిరసన హక్కా?
మంత్రిని నిలదీస్తే మహిళను స్టేషన్‌కు పిలిపిస్తారా?
చంద్రబాబుపై చెప్పులు వేసింది ఓ రైతా?
రాళ్లు వేసిన వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారా?
 విపక్ష నేతపై ఆందోళనకు పోలీసు పర్మిషనా?
తనను కాదని.. ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీగా నియమించినప్పటి నుంచీ చంద్రబాబుపై ప్రస్తుత డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ రగిలిపోతున్నారు. తనను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పంపి లూప్‌లైన్లో వేశారన్న కోపం ఆయన ప్రతి మాటలో కనిపిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మాణ, అభివృద్ధి పనులన్నీ నిలిపివేసిన జగన్‌ ప్రభుత్వం.. రైతుల త్యాగాలకు పూచికపుల్ల విలువైనా ఇవ్వకుండా రాజధానిని మార్చాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో అమరావతిలో ఆగిన నిర్మాణాలను పరిశీలించేందుకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అక్కడ పర్యటించాలనుకున్నారు. పోలీసుల అనుమతి తీసుకుని మరీ అక్కడకు వెళ్లారు. కానీ అమరావతిలో ఆయన ఊసేలేకుండా చేయాలని నడుంకట్టిన జగన్‌.. తన తాబేదార్లను రంగంలోకి దించారు. పోలీసుల సమక్షంలోనే చంద్రబాబుపై వైసీపీ కార్యకర్తలతో చెప్పులు, రాళ్లు వేయించారు. దీనికి వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉండగా.. వారి అధికార ప్రతినిధిగా డీజీపీ రంగప్రవేశం చేశారు. రాళ్లు, చెప్పులు విసిరినవారెవరో తనకు తెలుసన్నారు. ‘చంద్రబాబుపై చెప్పు విసిరింది ఓ రైతు. రాళ్లు వేసిన వ్యక్తి రియల్టర్‌. నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంది. మీరు ఒక వైపే చూపిస్తున్నారు.. రెండో వైపు కూడా చూడాలి. కారణమేంటో తెలుసుకోవాలి. వారిద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకున్నాం. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని బాధ్యులను ప్రశ్నించగా... తాను రైతునని ఒకరు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసి చంద్రబాబు వల్ల నష్టపోయానని మరో వ్యక్తి చెప్పారు’ అని వెల్లడించారు.

రాజధానిలో రైతులు ఎవరి వల్ల అన్యాయమైపోయారు? ఇసుక లేకుండా.. రాజధాని నిర్మాణాలు ముందుకు నడవకుండా.. వారి భూముల విలువ పడిపోయేటట్లు చేసింది చంద్రబాబా? అమరావతి ప్రాంతంలో కమ్మకులస్తులే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని.. వారిని ఆర్థికంగా దెబ్బతీసే ఉద్దేశంతో ఆ వ్యాపారాన్ని నాశనం చేసింది జగనా.. చంద్రబాబా? ఓ అఖిల భారత సర్వీసు అధికారి ఇంత అడ్డగోలుగా.. నోటికొచ్చినట్లు మాట్లాడతారా? ప్రభుత్వానికి బదులు ఆయన సమాధానం చెబుతారా? పైగా పల్నాడులో వైసీపీ శ్రేణులు అరాచకాలు సృష్టిస్తుంటే కళ్లుపెట్టి చూడలేని ఈ కబోధి.. చంద్రబాబు అక్కడ పర్యటిస్తే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని అనుమతి ఇవ్వలేదన్నారు. శాంతిభద్రతలు సరిగా లేవనే కదా.. ఆయన అక్కడకు వెళ్లాలనుకుంది? అమరావతిలో పర్యటనకు అనుమతిచ్చినట్లే ఇచ్చి.. అధికార పక్షం నిరసనలు తెలపడానికి అవకాశమిస్తారా? కనీసం హోంగార్డు కూడా ఈ పనిచేయరు? జగన్‌పై రాజభక్తి ప్రదర్శించడానికి సవాంగ్‌ చేయని ప్రయత్నం లేదు. ‘పర్మిషన్‌ ఇచ్చినందుకే ఇంత జరిగింది... ఇవ్వకుంటే ఇంకా పెద్దది జరిగేది’ అని చెప్పడం ఆయన మనసులోని దురుద్దేశాన్ని చాటుతోంది. నిజానికి చంద్రబాబు కాన్వాయ్‌పై దుండగులు విసిరిన లాఠీలు పోలీసులవి. ఇవి వైసీపీ కార్యకర్తల చేతుల్లోకి ఎలా వచ్చాయి? పోలీసులే వాటిని విసిరారని చెప్పవచ్చా? చంద్రబాబు పర్యటన అధికార పార్టీలో వణుకు పుట్టించిందనేది సుస్పష్టం. అక్కడ ఏయే టవర్లు ఎంత శాతం పూర్తయిందీ ఈ పర్యటనతో చంద్రబాబు అన్నీ బయటపెట్టారు. అదంతా అడవేనని, శ్మశానమని కారుకూతలు కూసిన మంత్రులు ఇప్పుడు నోరెత్తలేని పరిస్థితి తీసుకొచ్చారు.

బస్సు అద్దాలు పగలగొట్టి..
వాస్తవానికి ఓ వైసీపీ కార్యకర్త..పోలీసు చేతిలోని లాఠీని గుంజుకుని బాబు కాన్వాయ్‌పై విసిరాడు. బాబు పర్యటిస్తున్న బస్సు అద్దం పగిలింది. పర్యటన సాగిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఆసాంతం చంద్రబాబు గో బ్యాక్‌.. క్షమాపణ చెప్పి రాజధానిలో అడుగుపెట్టాలి.. రాజధానిలో పర్యటించే అర్హత చంద్రబాబుకు  లేదు అంటూ ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. కిరాయి గూండాలతో రాళ్లు రువ్వించారు. ఈ వ్యవహారంలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యడ్లపల్లి రమేష్‌, కొండెపాటి బుజ్జి, ఆలూరి శ్రీనివాసరావు, గూడూరు బాపయ్యలను తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయితే వైసీపీ స్థానిక నాయకులు పోలీసుస్టేషన్‌కు చేరుకుని పెద్దలతో చెప్పించడంతో ఆ నలుగురినీ స్టేషన్‌ నుంచి పంపించివేశారు. చంద్రబాబును దుర్భాషలాడిన మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదుచేసినా పట్టించుకోని పోలీసులు.. మంత్రి అనుచితంగా మాట్లాడుతున్నారని అన్నందుకు ఓ మహిళను స్టేషన్‌కు పిలిపించి.. నాలుగైదు ఠాణాలు తిప్పించి.. విచారించి పంపారు. ఇంత దుర్మార్గం ఏ రాష్ట్రంలోనైనా ఉందా?