హైకోర్టుకు మళ్లీ డీజీపీ ... కారణమే షాకింగ్

August 10, 2020

సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా లా అండ్ ఆర్డర్ వ్యవహారంలో పోలీస్ బాస్ డీజీపీ మాటే ఫైనల్. ఏదైనా విషయంలో ప్రతిపక్షాలు గొడవ చేసినా... పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్లినా సంబంధిత పోలీసు అధికారులు కోర్టులకు సమాధానమిచ్చి సరిపెడుతుంటారు. దాదాపుగా డీజీపీ స్థాయి వ్యక్తి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం అన్ని సందర్భాల్లో ఉండదు. అయితే, తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు మాత్రం తాజాగా అటువంటి అవసరం వచ్చింది.

తమ ముందు సవాంగ్ హాజరు కావాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీజ్ చేసిన వాహనాల అప్పగింత వ్యవహారంలో సంబంధిత పోలీసు అధికారుల వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో స్వయంగా డీజీపీ రావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు వేర్వేరు కారణాలతో హైకోర్టుకు సవాంగ్ రెండు సార్లు హాజరయ్యారు.

మూడోసారి ఏపీ డీజీపీ సవాంగ్ హైకోర్టులో హాజరయ్యారు. ఓ దంపతులకు సంబంధించి హెబియస్‌కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సవాంగ్ తొలిసారి హైకోర్టులో హాజరయ్యారు. విశాఖపట్టణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన వ్యవహారం నేపథ్యంలో రెండోసారి కోర్టు మెట్లెక్కారు.

చంద్రబాబుకు స్థానిక పోలీసులు ఇచ్చిన నోటీసులపై వివరణ కోరుతూ డీజీపీ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఆ వ్యవహారంలో సుమారు ఆరున్నర గంటలపాటు సవాంగ్ కోర్టులో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక తాజాగా మూడోసారి డీజీపీ మరోసారి రావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.

అక్రమ మద్యం తరలింపు వ్యవహారంలో పట్టుబడిన వాహనాల అప్పగింత వ్యవహారంలో సవాంగ్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ వాహనాల అప్పగింతలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో పోలీసులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ తమ ముందు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు హైకోర్టు ముందు సవాంగ్ హాజరు కానున్నారు.