వెంక‌న్న సాక్షిగా బాబు ప‌రువుతీస్తున్న టీడీపీ సీనియ‌ర్‌

September 17, 2019

`అనువుగాని చోట అధికుల‌మ‌న‌రాదు`అనే సామెత ఎప్ప‌టినుంచో వాడుక‌లో ఉంది. స‌మ‌యం మ‌న‌కు అనుకూలంగా లేన‌పుడు హ‌డావుడి చేయ‌డం స‌రికాదు. ఎడ్డెం అంటే తెడ్డం అనడం అంత‌కంటే మంచిది కాదు. ఇక రాజ‌కీయాల్లో అయితే తెలిసిన సంగ‌తే. కానీ ...టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ నేత ప‌ద‌వి ప‌ట్టుకొని వేలాడుతానంటూ మారాం చేస్తున్నారు. త‌ద్వారా క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన‌, హుందా రాజ‌కీయాల‌కు చిరునామా అయిన టీడీపీని రోడ్డు పాలు చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన నేప‌థ్యంలో..వైసీపీ త‌మ పార్టీ నేత‌ల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టేందుకు దేవాల‌యాల పాల‌క‌మండ‌ల్ల‌ను ర‌ద్దు చేసేందుకు స‌న్న‌ద్ధం అవుతోంది. ఈ క్ర‌మంలో అత్యంత ప్ర‌ముఖ‌మైన తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలిపై అంద‌రి చూపు ప‌డింది. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పేరును వైసీపీ ఖరారు చేసింది. అయితే, టీటీడీ పాలకమండలి చైర్మన్, బోర్డు సభ్యులు రాజీనామా చేసేందుకు అంగీకరించడంలేదు. టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాత్రం తాను ప‌ద‌వి వ‌దిలేది లేదంటున్నారు. దీంతో ఆర్డినెన్స్ తెచ్చి పాలకమండళ్లను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే, ఆర్డినెన్స్ ద్వారా పాలక మండలి రద్దుకు న్యాయ పరమైన సమస్యలు ఉన్నాయి... దీనిపై కోర్టుకు వెళ్లి కొనసాగింపు ఉత్తర్వులు తెచ్చుకోనే అవకాశం ఉండటంతో.. ఆర్డినెన్స్ ఆలోచన ప్రభుత్వం విరమించుకున్నట్టు సమాచారం.

ఈ నేప‌థ్యంలో టీటీడీ పాలకమండలిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పుట్టాపై కొత్త‌ అస్ర్తం ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సుధాకర్ యాదవ్... స్విమ్స్‌లో అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదిక సమర్పించింది టీటీడీ... ఈ కారణంగా చైర్మన్ పదవి నుంచి సుధాకర్ యాదవ్‌ని సస్పెండ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. స్వీమ్స్ వ్యవహారాలపై సుధాకర్ యాదవ్ ని వివరణ కోరనున్నారు... వివరణపై సంతృప్తి చెందకపోతే చైర్మన్ పదవి నుంచి పుట్టాను తొలగిస్తారని తెలుస్తోంది. ఇలా అవ‌మాన‌కరంగా ప‌ద‌వి పోగొట్టుకునే బ‌దులు హుందాగా ఇప్ప‌టికే నామినేటెడ్ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన కొంద‌రు టీడీపీ నేత‌ల వ‌లే...పుట్టా సైతం రాజీనామా చేయ‌వ‌చ్చుగా అంటూ ప‌లువురు హిత‌వు ప‌లుకున్నారు.