అప్పుల్లో వైసీపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు...

August 13, 2020

సాధారణంగా ఏ ప్రభుత్వమైన అభివృద్ధిలోనో లేదా సంక్షేమ పథకాల్లోనో సరికొత్త రికార్డులు సృష్టిస్తారు. కానీ ఏపీలో ఉన్న వైసీపీ మాత్రం అప్పులో తిరుగులేని రికార్డు ఒకటి సాధించింది. వైసీపీ ప్రభుత్వం ఒక్క నవంబర్ నెలలోనే పది సార్లు అప్పులు తీసుకుని చరిత్ర సృష్టించింది. రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలు తగ్గిపోవడంతో.... ప్రభుత్వం అప్పులతోనే నడుస్తుంది. తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్, అభివృద్ధిని గాలికొదిలేసి తన నవరత్నాలు అమలు కావాలని చెప్పి ఆరు నెలల్లోనే ఎక్కువ పథకాలు తీసుకొచ్చేశారు. దీని వల్ల పథకాలకు డబ్బులు లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
మామూలుగా సంక్షేమ పథకాలు ఎవరు వద్దు అనరు... కానీ అభివృద్ధి లేకుండా ఆదాయం సృష్టించకుండా కేవలం సంక్షేమ పథకాలు మీదే దృష్టి పెట్టడం వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా అయిపోయింది. దీని వల్లే కేవలం ఒక్క నవంబర్ లోనే వైసీపీ ప్రభుత్వం 10 సార్లు సెక్యూరిటీ బాండ్లని తనఖా పెట్టి రుణం తీసుకుంది. ఆర్‌బి‌ఐ ప్రతివారం బారోయింగ్స్ ద్వారా వేలం నిర్వహిస్తుంది. ఇలా వేలం పెట్టిన ప్రతిసారి పాల్గొని ఏపీ ప్రభుత్వం బాండ్లని తనఖా పెట్టి రెండేసి సార్లు రుణాలు పొందింది.
నవంబర్1న జరిగిన వేలం పాటలో 9 ఏళ్ళు తిరుగు చెల్లింపుతో 1000 కోట్లు, అలాగే 12 ఏళ్ల తిరుగు చెల్లింపుతో మరో 1000 కోట్లు తీసుకుంది. ఇదే విధంగా నవంబర్ 7న 2 వేల కోట్లు, నవంబర్ 15న మరో రెండు వేల కోట్ల రుణం తీసుకుంది. ఇక నవంబర్ 22న 2 వేల కోట్లు, 29న 533 కోట్లు తీసుకుంది. ఇలా ఒక్క నవంబర్ నెలలోనే రూ. 8,533 కోట్ల రుణం తీసుకుంది. ఇక మొత్తం ఆరు నెలల్లో రూ. 33,617 కోట్ల రుణం అయింది. ఇక ఆర్ధిక సంవత్సరం పూర్తి కావడానికి మరో నాలుగు నెలలు ఉంది. అయితే రాష్ట్రానికి ఉన్న రుణం పరిధి ఇంకా 7 వేల కోట్లు మాత్రమే. మరి ఈ నాలుగు నెలలు రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిస్తారో ? చూడాలి.