జగన్ ఆలోచనలు ప్రమాదకరమేనా?

June 02, 2020

చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకోవడం, బీజేపీ - వైసీపీ లోపాయకారీ ఒప్పందం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి చంద్రబాబు 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. స్వంత రాష్ట్రం వాళ్లు, పక్క రాష్ట్రం వాళ్లు, జాతీయ మీడియా జగన్ ప్రభుత్వ పనితీరుపై ఆశ్చర్యం, విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని టీడీపీకి చెందిన కీలక నేతల్ని కూడా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. తాజాగా, మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ నియామకం సంచలనంగా మారింది. రాత్రికి రాత్రి జీవో జారీ చేసి, మరుసటి రోజునే సంచయితచే ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటిదాకా చైర్మన్‌గా ఉన్న టీడీపీ కీలక నేత అశోక్ గజపతి రాజును తప్పించారు. ఇది కలకలం రేపుతోంది. వాస్తవానికి అది ఒక కుటుంబానికి చెందిన స్వంత ఆస్తి వ్యవహారం కాకపోతే... ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉన్నా తన పరిధులకు లోబడి ఆనాటి రాజుల దానగుణాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా దీని జోలికి పోలేదు. 

అయితే జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పరిపాలన, ప్రజల కోసం పని చేయడం మానేసి, చంద్రబాబు టార్గెట్‌గా, టీడీపీని నిర్వీర్యం చేసే దిశలో పని చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అందుకోసం అతను ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఈ క్రమంలో  పీపీఏ సమీక్ష అంశం జాతీయ, అంతర్జాతీయంగా జగన్ ప్రభుత్వానికి మరక తెచ్చింది. అసలు భారతదేశంలో పెట్టుబడులపైనే పునరాలోచించేలా చేసింది. ఇక మూడు రాజధానుల అంశం కూడా అమరావతి అభివృద్ధి ఐతే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకి వెళ్తుందనే అక్కసు కనిపించిందనే వాదనలు వినిపించాయి.

పీపీఏల సమీక్ష, సీఆర్డీఏ రద్దు, అమరావతి రాజధాని నుండి ఏపీకి మూడు రాజధానులు, పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ మొదలు.. నేడు సంచయిత వరకు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే కేవలం టీడీపీని దెబ్బకొట్టేందుకే ఆయన అధికారంలోకి వచ్చినట్లుగా కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ తీరు చూస్తుంటే భవిష్యత్తులోనూ ఎన్నో ప్రమాదకర నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తోందని అంటున్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రతి అంశంలోను స్వార్థం, స్వలాభం కోసమే ముందుకు సాగుతున్నారంటున్నారు. టీడీపీ అనేది ఒక రాజకీయ పార్టీ. దానిపై పగ ఉంటే వ్యక్తిగతంగా జగన్ వారితో ఏ పేచీ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఆ పార్టీని నాశనం చేసే క్రమంలో ఏపీ వినాశనానికి దారితీసే నిర్ణయాలు తీసుకోవడమే అందరిలో భవిష్యత్తుపై నెలకొన్ని భయానికి కారణం. 

జగన్ ముఖ్యమంత్రిగా గెలిచిన ఈ 10 నెలల కాలంలోనే ప్రమాదకర, కక్షపూరిత నిర్ణయాలు తీసుకున్నారని, ఇలాగే ముందుకు సాగితే రాజకీయ అధికార దుర్వినియోగం గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఎక్కడా చూడని విధంగా ప్రమాదంలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేసేవారు లేకపోలేదు. సుదీర్ఘకాలం చంద్రబాబు, వైఎస్ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ మరీ ఇంతలా దిగజారలేదని, తెలంగాణ ఉద్యమం సమయంలోను కేసీఆర్ కొంత పద్దతిగా వెళ్లారని గుర్తు చేస్తున్నారట. ఇప్పుడు జగన్ వ్యవహారంపై అధికార, విపక్ష నేతలు చెవులు కొరుక్కుంటున్నారట.

కరకట్టపై ప్రజావేదిక కూల్చివేత కేవలం చంద్రబాబును ఇబ్బందుల్లోకి నెట్టేందుకేనని ఆనాడే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత పీపీఏలను సమీక్ష అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్రం, జపాన్ కూడా వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. అమరావతిపై చంద్రబాబు ముద్ర లేకుండా చేసేందుకు తెరపైకి మూడు రాజధానుల అంశాన్ని తీసుకు వచ్చారని చెబుతున్నారు.

ఇప్పుడు ఏకంగా ప్రయివేటు వంశస్తులు స్థాపించిన ట్రస్టుల్లో రాజకీయ జోక్యంతో టీడీపీపై ఉద్దేశ్యపూర్వక కక్ష సాధింపు ద్వారా జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇట్టే అర్థమవుతోందని అంటున్నారు. చర్చిల నిర్మాణం, పాస్టర్లకు జీతాలు కూడా విమర్శలకు దారి తీసింది. చివరకు ఎన్నికల కమిషన్ అధికారాలను కూడా తన చేతిలోకి తీసుకునే ఆర్డినెన్స్ తీసుకువచ్చే పరిస్థితి వచ్చిందంటే జగన్ ఎంతటి ప్రమాదకరపు ఆలోచనలు చేస్తున్నారో తెలిసిపోతుందని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ తీసుకునే ఈ నిర్ణయాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందని, ప్రజలకు ఇలాంటి ప్రభుత్వాలపై నమ్మకం పోయేలా చేస్తుందని అంటున్నారు.