బుగ్గనకు జ్జానోదయం !!

May 31, 2020

దేనికనా టైం వస్తుంది. నిజం దాగదు. అబద్ధం వెలగదు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది బయటపడింది. అది కూడా అధికారికంగా బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సి న ఆర్థిక సాయంపై నిర్మలతో మాట్లాడినట్లు చెప్పారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుండి రూ.5 వేల కోట్లు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు.
కేంద్రం నుండి గ్రాంట్ రాలేదని, దీంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు మూడువేల కోట్ల రూపాయల రీయింబర్సుమెంట్స్ రావాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి జగన్ ప్రణాళిక రచించారని చెప్పారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
ఆర్థికమాంద్యం ప్రభావం ఏపీ పైన కూడా ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించేందుకు మరో మూడేళ్ల సమయం పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదని, అయినప్పటికీ అభివృద్ధి ఆగదని వ్యాఖ్యానించారు. విభజనతో పాటు గత ప్రభుత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. రూ.60 వేల కోట్ల వరకు చెల్లింపు బకాయిలు ఉన్నాయని, వీటిలో దాదాపు రూ.23 వేల కోట్లు చెల్లించామన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు సహకరించాలని కోరుతూ బుగ్గన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కోరారు. వ్యవసాయం, నీటిపారుదల, తాగునీరు అంశాలపై నీతి ఆయోగ్ నిపుణులతో చర్చించారు. 

అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలని చేసిన ప్రయత్నాలు ఎంతో కాలం సాగవని తేలిపోయింది. చంద్రబాబు ఐదేళ్లు ఆర్థిక కష్టాలను మోస్తూ దాటుకుంటూ వృద్ధి రేటును పెంచుకుంటూ పోతే... జగన్ కేవలం నవమాసాల్లోనే కష్టాలను డెలివరీ చేసేశారు. నా చేత కాదు అంటూ అనేక ఛార్జీల పెంపు రూపంలో ప్రజలపై వేశారు.