జగన్ లో అమరావతి భయం... ఎన్నికలొద్దు ప్లీజ్

June 02, 2020

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. మొత్తం మూడు దశల్లో రాష్ట్రంలో ఈ ఎన్నిక‌లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చెప్పారు. అయితే, ఈ స్థానిక పోరులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. రాజ‌ధాని అమ‌రావ‌తి గ్రామాల్లో ఎన్నిక‌లు జ‌ర‌ప‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం క‌మిష‌న్‌ను కోరింది. ఈమేర‌కు ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించరాదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏపీలో జ‌ర‌గ‌నున్న స్థానిక పోరులో మొదటి దశలో ఎంపీటీసీ,జడ్పీటీసీ, రెండవ దశలో పంచాయతీ, మూడవ దశలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉండ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే, కీల‌క‌మైన‌ స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో అమ‌రావ‌తి ఆందోళ‌న‌కు జ‌గ‌న్ స‌ర్కారు ఖ‌చ్చితంగా భ‌య‌ప‌డ‌నుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో వారి అభిప్రాయాలు నిజం చేస్తూ తూళ్లూరు మండలంలోని 19 గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.  వివిధ అంశాల‌పై హైకోర్టులో ఉన్న కేసులు, వ్యాజ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే, రాజ‌ధానిలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుందని అంటున్నారు.
కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 29 గ్రామాల్లోని మహిళలంతా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఇలా చేస్తున్నారు. ఇక వెలగపూడిలో మహిళలు 24 గంటల దీక్ష చేపట్టనున్నారు.. 151 మంది మహిళలు 12 గంటల దీక్ష చేయనున్నారు. మందడం, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, నవులూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, నిడమర్రులో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి.