ఏపీ ప్రభుత్వం పరపతి... గోవిందా !!

May 28, 2020

ఆంధ్రప్రదేశ్ రుణపరపతి పూర్తిగా దెబ్బతిన్నట్లు తాజా ఘటన ఒకటి రుజువు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ (ఏపీపీఎఫ్‌సీఎల్)కు అప్పు దొరకడం కష్టమైపోయింది. ఆ సంస్థకు గ్యారంటీగా ఉంటామని ప్రభుత్వం ముందుకొచ్చినా కూడా బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయట. రుణానికి గ్యారంటీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నా కూడా అసలు అప్పును ఎలా తీర్చగలరంటూ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
''అసలు మీకు అప్పు ఇస్తే తీర్చగలిగే శక్తి ఉందా? అప్పుగా తీసుకున్న మొత్తంతో ఏం చేస్తారు? ఇప్పటికే తీసుకున్న అప్పుల ద్వారా ఏమైనా సంపాదిస్తున్నారా?'' అంటూ ఏపీపీఎఫ్‌సీఎల్‌ను ఎస్బీఐ సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం.  అయితే, ప్రభుత్వం గ్యారంటీగా ఉంటానంటూ ముందుకురాగా.. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించడం లేదని, అలాంటప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి రుణం ఎలా ఇవ్వగలమని ఎస్బీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తుండడంతో భవిష్యత్ ప్రభుత్వాలు కూడా ఇలాగే చేస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయంతోనే ఎస్బీఐ వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.52 లక్షల కోట్లు ఉన్నాయని.. 2020 నాటికి అవి రూ. 3 లక్షల కోట్లకు పెరుగుతాయంటూ బ్రిక్‌వర్క్ సంస్థ నివేదికను ప్రస్తావించి ఎస్బీఐ రుణ మంజూరుకు నిరాకరించినట్లు సమాచారం. ''2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏపీపీఎఫ్‌సీఎల్ సంస్థ ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాలు రూ. 9,665 కోట్లు ఉంటే.. 2017-18 నాటికి అవి రూ. 35,964 కోట్లకు పెరిగాయని బ్రిక్‌వర్క్ నివేదిక సూచిస్తోంది. ప్రస్తుతం ఏపీపీఎఫ్‌సీఎల్ ప్రతిపాదించిన రూ. 3,000 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీగా ఉండటం వల్ల రుణభారం అసాధారణంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రుణం తిరిగి చెల్లించటం, అందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి'' అంటూ ఎస్‌బీఐ ఏపీపీఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసిందట. 

Read Also

జగన్ తప్పు... బీజేపీ బిక్షాటన
చంద్రబాబు ఇలా చేసి ఉంటే... ఎంత రచ్చ చేసేవారో
ఇమ్రాన్ పై పాక్ పత్రిక సంచలన కథనం