జగన్ వినరు... కోర్టు తిట్టక మానదు

June 04, 2020

ప్రభుత్వం ఏదైనా సంచలన నిర్ణయాలు తీసుకోవటానికి దమ్ము చాలా అవసరం. రోటీన్ గా పాలనా రథాన్ని నడిపించటం పెద్ద విషయమేమీ కాదు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా నడిపిస్తూ.. ఆచితూచి నిర్ణయాలు తీసుకునే వారికి మినిమం గ్యారెంటీ అన్న రీతిలో సాగుతుంటుంది. కానీ.. పరిస్థితి మొత్తాన్ని మార్చేయాలన్న తపన ఉన్న ముఖ్యమంత్రులు.. వారి వేగాన్ని అందుకునే విషయంలో అధికారులు అంత ప్రభావవంతంగా పని చేయలేనప్పుడే సమస్యలు వస్తుంటాయి. తాజాగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంటున్నారు.
ఒక రాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టి.. పాలనా పగ్గాలు చేతికి అందించిన వేళ.. వారి ఆశలకు తగ్గట్లుగా సంచలన నిర్ణయాలు తీసుకోవాలన్న తపన ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిదే ఏపీ ముఖ్యమంత్రి జగన్ లోనూ ఉందని చెప్పాలి. కానీ.. సమస్యల్లా.. ముఖ్యమంత్రి అనుభవ రాహిత్యం, బాసిజం, ఇగో... తనకు అనుభవం లేనపుడు సీనియర్ అధికారుల సహకారం తీసుకోవాలి. కానీ వారి మాట వినడం లేదు. సీఎస్ అయినా సరే.  తాను చెప్పింది చేయండి చాలు అంటూ ఆదేశాలిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చెప్పినట్లు పథకాలు రూపొందిస్తున్నారు. వాటి నిబంధనలు రూపొందిస్తుననారు. ఇది కూడా తప్పే. ఈ విషయంలో వారు చేసే తప్పులకు ప్రభుత్వం బాధ్యత వహించటమే కాదు.. న్యాయస్థానాల ఎదుట తరచూ అధికారులు చేతులు కట్టుకొని నిలుచోవాల్సిన అవసరం ఉంటుంది.
సంచలన నిర్ణయాల్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే తీసుకోరు. ఏపీకి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సంచలన నిర్ణయాల్ని తరచూ ప్రకటిస్తూ ఉంటారు. ఆయన చేసే ప్రకటనలు గంభీరంగా ఉండటమే కాదు.. సంచలనంగా ఉంటాయి. ఆయన మాటల్లో చెప్పే తీవ్రతకు.. జారీ అయ్యే జీవోలకు మధ్య పొంతన లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు.. దాన్ని చెప్పేటప్పుడు కొన్నిసార్లు అతిశయం మాటలు చెప్పొచు. ఆ సమయంలో వారేం చెప్పాలనుకున్నారన్న దానికే ప్రాధాన్యత ఇవ్వాలే కానీ.. అలా చెప్పారు కదా? అన్న ప్రశ్నలు బాగోవు.
కరోనా వేళ.. తాము రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం చెబితే.. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆసక్తికరంగా చెప్పారో తెలిసిందే. ప్రజల మంచి కోసం సరిహద్దుల్ని బంద్ చేస్తున్నామని.. ఎవరిని అనుమతించమంటూనే.. చీమ.. దోమ కూడా పక్క రాష్ట్రంలో నుంచి మన రాష్ట్రంలోకి రాలేవన్న అతిశయపు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కేసీఆర్ మాటల్ని యథాతధంగా తీసుకొని కామెడీ చేసుకునే కంటే కూడా.. ప్రభుత్వ కమిట్ మెంట్  ఎంతలా ఉందన్న విషయాన్ని చెప్పే క్రమంలో కాస్త ఎగ్జాగరేట్ చేసేలా చెప్పారన్నది మర్చిపోకూడదు.
ఇదంతా చూస్తున్నప్పుడు కనిపించేది ఒక్కటే.. ముఖ్యమంత్రి జగన్ తాను తీసుకునే నిర్ణయాల్లో పాజిటివ్ వరకే చూస్తున్నారు. వాటి విపరిణామాలు పట్టించుకోవడం లేదు. అందుకే జగన్ ప్రతి నిర్ణయంపై కోర్టులు చీవాట్లు పెడుతున్నాయి. తాము తీసుకునే నిర్ణయాలు కోర్టు ముందుకు వెళ్లినప్పుడు అక్కడ ఎలాంటి ఎదురుదెబ్బ తగలని రీతిలో పాలసీని తయారు చేయాలన్నది మర్చిపోకూడదు. ఈ విషయంలో ప్రభుత్వాధినేత కంటే కూడా.. ఆయన నమ్మి బాధ్యత అప్పగించిన అధికారులకే ఎక్కువగా ఉంటుంది. తాను చెప్పే మాటల్ని  సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన రీతిలో జీవోలు జారీ చేసే విషయంలో కేసీఆర్ ఎంత టైట్ గా ఉంటారన్న విషయాన్ని ఏపీ సీఎం జగన్ కూడా ఫాలో అయితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అనుభవం ఉన్న అధికారుల మాట వింటే చిక్కులు తప్పుతాయి. లేకపోతే జగన్ తప్పులకు అధికారులు, ప్రభుత్వం కోర్టుతో తిట్లు తింటూ ఉండాల్సిందే.