ఏపీ గవర్నమెంటు ఉద్యోగాలు పీకేసింది !

June 02, 2020

 కరోనా విపత్తు నేపథ్యంలో అనివార్యమైన లాక్ డౌన్ వల్ల ఆర్థిక మాంద్యం రాబోతోందని, ప్రైవేటు వేలాది మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని సర్వేలు, ఆర్థిక నిపుణులు చెబుతోన్న సంగతి తెలిసిందే. ఐటీ రంగంతో పాటు పలు రంగాల్లో ఉద్యోగాల కోత తప్పదని చెబుతున్నారు. మరోవైపు కరోనా ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో సమగ్ర శిక్ష ప్రాజెక్టులో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 23 వతేదీతో 2019-20 విద్యాసంవత్సరం ముగిసిందని, కాబట్టి ఏప్రిల్ 29 వ తేదీ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తొలగించాలని పేర్కొంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కాంట్రాక్టు రెన్యువల్ చేయడం, కొత్తగా ఉద్యోగుల నియామకం వంటివి చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేజీబీవీ, ఎమ్మార్సీ, డీపీవో ఆఫీసుల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేజీబీవీ, ఎమ్మార్సీ, డీపీవో ఆఫీసుల్లో వేలాది మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు.

2019-20 విద్యా సంవత్సరం గడువు ఏప్రిల్ 23 వ తేదీతో ముగిసింది. దీంతో, ఆ కాంట్రాక్టు ఉద్యోగుల గడువు కూడా ఏప్రిల్ 29తో ముగిసింది. అయితే, మే 1, 2020 నుంచి వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకొని యధావిధిగా కొనసాగించాల్సి ఉంటుంది. అయితే, కారణాలేమిటన్నది తెలియకపోయినప్పటికీ...ప్రభుత్వాదేశాలు వచ్చేవరకు వారందరినీ విధుల్లోకి తీసుకోవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాలతో కేజీబీవీ, ఎమ్మార్సీ, డీపీవో ఆఫీసుల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, మెసెంజర్లు, ఐఈఆర్టీలు,అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు పలువురు ఉద్యోగాలు కోల్పోయినట్లయింది. వీరందరినీ కొనసాగించడం లేదా తొలగించడం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కరోనా విపత్తు నేపథ్యంలో ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం వీరిని కొనసాగిస్తుందా...లేదా అన్నది తెలియాల్సి ఉంది.