నిమ్మగడ్డ తర్వాత.. అది చేస్తే జగన్ హీరో అయ్యేవాడు

August 14, 2020

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సుతరామూ ఇష్టం లేని నిమ్మగడ్డను తిట్టడానికి ఆయన పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలు (22వ వ్యక్తి రఘురామరాజు అంగీకరించలేదు) ఒకరికి మించి ఒకరు పోరాడారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎంతో ఇష్టపడిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క ఎంపీ గాని ముందుకు రాలేదు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నా, మారినా ఏపీకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. కానీ ప్రత్యేక హోదా వస్తే లాభం, రాకపోతే నష్టం.... దీనివల్ల ప్రజలకు లాభనష్టాలున్నాయి. అలాంటపుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుల చుట్టు లాయర్లకు కోట్లు ఖర్చుపెట్టి తిరగాల్సింది ప్రత్యేక హోదా కోసమా? లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను దించడం కోసమా?

రాజ్యాంగంపై నే పోరాడటానికి కోర్టులను ఎదిరించిన వైసీపీ పార్టీ... ఏపీ ప్రజలకోసం ప్రత్యేక హోదా కోసం ఎందుకు సుప్రీంకోర్టుకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. ప్రత్యేక హోదాపై పోరాడితే కనీసం ఎంతోకొంత ఏపీ ప్రజలు లాభపడే అవకాశం ఉంది.

మరి అలాంటపుడు ప్రభుత్వం పోరాడాల్సింది ప్రత్యేక హోదా కోసమా? నిమ్మగడ్డను తొలగించడం కోసమా? ఒక్కసారి దీని గురించి ప్రజలు ఆలోచించాలి. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెళ్లిన ప్రతి అంశం ప్రజలకు సంబంధించి కాదు... రంగులు పార్టీవి, నిమ్మగడ్డ పార్టీవి ఇలా కేవలం వ్యక్తిగత ఆసక్తుల మీదనే వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తోంది. 

ప్రజల కోరిక మేరకు వైసీపీ తరఫున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ ఒక పిటషను వేస్తే... దాని కోసం పోరాడితే జనం నిజంగా జగన్మోహన్ రెడ్డిని హర్షిస్తారు. ఆయనకు మద్దతు పలుకుతారు. ఎందుకోమరి... అసలు ఆ టాపిక్ మాట్లాడితేనే జగన్ గారికి చిరాకు. ఇంకా 4 సంవత్సరాలు, మళ్లీ మోడీ గెలిస్తే ఇంకో 9 సంవత్సరాలు ప్రత్యేక హోదా మాట్లాడినా ఉపయోగం లేదంటారు. మరి ఏం చేద్దాం...  నాలుగేళ్లు ఆగితే దేనివల్ల ఉపయోగం ఉండదో జనాలే తేల్చుకుంటారు.