ఏపీ ప్ర‌భుత్వం లాట‌రీ పెట్ట‌బోతోందా?

August 14, 2020

విభ‌జన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ అస‌లే ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డింది. చాల‌ద‌న్న‌ట్లు గ‌త ప‌ర్యాయం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్ర‌భుత్వం భారీగా అప్పులు చేసి పెట్టింది. ఐతే త‌ర్వాత అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్ స‌ర్కారు గ‌త ప్ర‌భుత్వానికి ఏమాత్రం తీసిపోలేదు. ఏడాది తిర‌క్కుండానే గ‌త ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో చేసిన అప్పుల్లో స‌గం పైనే అప్పులు చేసింది. ఇంత‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చి ప‌డింది. ఏపీ ఖ‌జానాను మ‌రింత‌గా దెబ్బ తీసింది. ఇప్పుడు జీతాలివ్వ‌డానికి కూడా త‌డుముకోవాల్సిన ప‌రిస్థితి తలెత్తింది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ సంక్షేమ ప‌థ‌కాల‌కు మాత్రం జ‌గ‌న్ నిధులు ఆప‌ట్లేదు. దీంతో రాబోయే రోజుల్లో ఏపీ ఆర్థికంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కోబోతున్న‌ట్లు ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.
దీన్నుంచి ఏపీ ఎలా బ‌య‌ట‌ప‌డుతుంద‌న్న‌ది అర్థం కావ‌డం లేదు. ప్ర‌భుత్వానికి భారీగా ఆదాయం తెచ్చి పెట్టే మ‌ద్యం అమ్మ‌కాల విష‌యంలోనూ ప్ర‌భుత్వం నియంత్ర‌ణ పాటిస్తుండ‌టం, పెట్టుబడుల‌న్నీ వెన‌క్కి వెళ్తున్న నేప‌థ్యంలో భ‌విష్య‌త్తుపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఐతే ఈ సంక్షోభం నుంచి కొంత మేర బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌భుత్వం లక్కీ లాటరీ స్కీమ్‌ల‌ను ప్రవేశపెట్టాలనే ఓ ఆలోచన మొదలైనట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి ఇప్పుడు అత్యవసరంగా ఏదొక మార్గం ద్వారా నిధులు రావాల్సి ఉంది. కరోనా సంక్షోభం నుండి బయటపడేందుకు కేంద్రం రాష్ట్రాలకు వెనక్కి ఇచ్చిన నిధులను కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమానికి కేటాయించేసిన నేప‌థ్యంలో లాట‌రీ ప్ర‌వేశ పెట్ట‌డ‌మే మార్గ‌మ‌ని స‌ల‌హాదారులు సూచించార‌ట‌. 

గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌భుత్వం లాట‌రీ స్కీమ్స్ న‌డిపేది. ఐతే ప్రజలకు ఇవి ఓ వ్యసనంలా మారి సమాజంపై చెడు ప్ర‌భ‌వం చూపుతున్నాయ‌ని భావించి వాటిని నిషేధించారు. కేరళ లాంటి కొన్ని రాష్టాల్లో మాత్రం ఇంకా లాట‌రీలు కొన‌సాగుతున్నాయి. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ప్ర‌జ‌ల్లో విద్యావంతులు పెర‌గ‌డంతో ఒక‌ప్ప‌ట్లా ఇప్పుడు చెడు ప్ర‌భావం మ‌రీ ఎక్కువ ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ట‌. లాట‌రీ టికెట్ల మీద వ‌చ్చే ఆదాయంతో పాటు ప్రైజ్ మనీలో 30 శాతం ప‌న్ను రూపంలో ప్ర‌భుత్వానికి అందుతుంది. ఐతే మ‌ద్య‌పానం మంచిది కాద‌ని ద‌శ‌ల వారీగా నిషేధించే పనిలో ప‌డ్డ జ‌గ‌న్ స‌ర్కారు లాట‌రీ టికెట్ల వ్య‌స‌నాన్ని ప్రోత్స‌హించ‌డం మొద‌లుపెడితే ప్ర‌తిప‌క్షాలు, జ‌నాల నుంచి ఎలాంటి స్పంద‌న ఉంటుందో మ‌రి?