డాక్టరు సుధాకర్ కేసు - ఏపీ సర్కారుకుపై హైకోర్టు సీరియస్

August 05, 2020

డాక్టరు సుధాకర్ కేసు జగన్ సర్కారు మెడకు చుట్టుకుంది. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కక్ష గట్టి అతడ్ని సస్పెండ్ చేసిందని ప్రభుత్వంపై తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. ప్రశ్నించిన వారు గొంతు నొక్కడానికి ఇదేమీ నియంతృత్వం కాదని, ఎవరైనా ప్రభుత్వాన్ని పరుషంగా ప్రశ్నించే అవకాశం రాజ్యాంగం ఇచ్చిందని వాదిస్తోంది.

అయితే, సుధాకర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా వైసీపీ నేతలు అతనికి ఫోన్ చేసిన బెదిరించారని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల అతను బాగా డిప్రెషన్లోకి పోయినట్లు అర్థమవుతోంది. అయితే, అప్పటికీ అతడిని వదలని వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా అతన్ని వైజాగ్ లో ఇరికించినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. రాజ్యాంగాన్ని, మానవ హక్కులను ఉల్లంఘించి అత్యంత అమానవీయంగా డాక్టరును హింసించారని చంద్రబాబు దుమెత్తి పోశారు.

ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (IMA) కూడా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసి ఘటనపై అసంతృప్తి వ్యక్తంచేసింది. వైద్యుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా విశాఖపట్టణం ఘటన ఉందని... పోలీసుల అమానవీయ ప్రవర్తనను తప్పు పట్టింది. ఈ కేసులో హైకోర్టు జోక్యం చేసుకుంది.

వివాదాస్పదంగా మారిన విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు హైకోర్టులో ఈరోజు విచారణ జరగగా... ప్రస్తుతం వైజాగ్ మానసిక వైద్యశాలలో సుధాకర్ చికిత్స పొందుతున్నట్లు ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. అయితే, డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు  ఇచ్చింది. విశాఖ సెషన్స్ జడ్జి నేరుగా ఆస్పత్రికి వెళ్లి డా.సుధాకర్ వాంగ్మూలం రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.  రేపు సాయంత్రం వరకు నివేదిక సమర్పించాలని పేర్కంది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్, వీడియో క్లిప్పింగ్‍లను పిటిషనర్ తరపు న్యాయవాదులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడం గమనార్హం.  విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.