అమరావతి: ఏపీ సర్కారుకు హైకోర్టు ఏం చెప్పింది?

May 28, 2020

అమరావతిలోని కార్యాలయాల్ని తరలించాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్.. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆఫీసుల్ని వెలగపూడి నుంచి తరలించాలన్న అంశాన్ని ప్రభుత్వంతో ఏపీ హైకోర్టు విభేదించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా.. కోర్టు ఏం చెప్పిందన్నది యథాతధంగా చూస్తే..

%  ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఉండాలన్న నిర్ణయం ప్రభుత్వ పరిధిలోని అంశమే. కానీ... రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ ఆఫీసులను వెలగపూడి నుంచి తరలించాలన్న నిర్ణయం సదుద్దేశంతో తీసుకున్నది కాదు.
% ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 39 కింద ఉన్న జోన్‌లోకి ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి. ఈ చట్టాన్ని ఉపసంహరిస్తూ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన బిల్లులో కూడా మాస్టర్‌ ప్లాన్‌ అమలు ఉంది. దానికి భిన్నంగా కార్యాలయాలను తరలించడం చట్టవిరుద్ధం.
%  పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులు శాసన మండలిలో ఆమోదం పొందకపోవడంతో కార్యాలయాల తరలింపునకు ప్రభుత్వం పరోక్షంగా ‘షార్ట్‌ కట్‌’ విధానాన్ని అనుసరించింది. వెలగపూడి నుంచి కర్నూలుకు తరలించేందుకు వీలుగా జనవరి 31న జారీ చేసిన జీవో నెంబరు 13 అమలు చేయమని చెప్పం.
%  విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలకు తాత్కాలిక సచివాలయంలో తగినంత స్థలం లేదన్న వంకతో వీటిని రాజధానికి 350 కిలోమీటర్ల అవతల ఉన్న కర్నూలుకు తరలించడం ఏమాత్రం సహేతుకం కాదు.
%  ఈ రెండు కార్యాలయాలకు తగిన స్థలం చూడాలని ప్రభుత్వం కర్నూలు జిల్లా కలెక్టర్‌కు ఎలాంటి లేఖ రాయలేదు. అయినప్పటికీ కర్నూలు కలెక్టర్‌ ఫలానా భవనాలు విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలకు అనువుగా ఉన్నాయని ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
%  కలెక్టర్‌ తనంతట తానుగా ఈ లేఖ రాశారా? ఎవరి జోక్యంతోనైనా రాశారా? అన్న విషయంపై స్పష్టత లేదు. నోట్‌ షీట్‌ ప్రకారం ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకే కార్యాలయాల తరలింపు జీవో జారీ అయిందన్న విషయం స్పష్టమవుతోంది
%  సచివాలయంలో ఈ కార్యాలయాలకు తగిన స్థలం లేకపోతే.. విజయవాడ, గుంటూరు, ఏలూరుల్లో 50 నుంచి 100 కి.మీ. పరిధిలో కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. ఆ పని చేయకుండా, ఎవ్వరూ అడగకుండానే కర్నూలులో ఈ రెండు కార్యాలయాలకు తగిన స్థలం ఉందన్న కలెక్టర్‌ లేఖ ఆధారంగా ప్రభుత్వం ఈ జీవో జారీ చేయటం ఏమిటి?
%  ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పింది. అయితే అదే సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాలు నిబంధనలకు అనుగుణంగా, సహేతుకంగా లేనప్పుడు న్యాయసమీక్ష చేయవచ్చని చెప్పిందని మర్చిపోకూడదు.
%  కేవలం విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను మాత్రమే కర్నూలుకు తరలించడం వల్ల విజిలెన్స్‌ వ్యవహారాలను సమర్థంగా పర్యవేక్షించడం విజిలెన్స్‌ కమిషన్‌కు కష్టమవుతుంది. కమిషన్‌ ఏర్పాటు ఉద్దేశమే నెరవేరదు. ప్రతీ శాఖకు చెందిన అధికారులు చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌కు నివేదిక సమర్పించేందుకు.. భేటీ కావటానికి 350 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు రెండు పని దినాలు పోతాయి.