సోషల్ మీడియాపై ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

February 25, 2020

ఎలాంటి సెన్సార్ లేకుండా.. ఏం చెప్పాలనుకుంటే దాన్ని చెప్పేయటం.. పొగడాలన్నా.. తిట్టాలన్నా.. చిరాకు పడాలన్నా.. ఆకాశానికి ఎత్తేయాలన్నా.. పాతాళానికి తొక్కేయాలన్నా.. సోషల్ మీడియాలో నచ్చిన రీతిలో పోస్టులు పెట్టటం ఇప్పుడో అలవాటుగా మారింది. డెస్క్ టాప్ మీద చేసే పనులు.. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ద్వారా పోస్టులు పెట్టేసే వీలు రావటంతో.. ఎవరు ఎక్కడి నుంచైనా.. ఎవరి మీదనైనా పోస్టులు పెట్టేస్తున్న పరిస్థితి.
తమ భావోద్వేగాల్ని కంట్రోల్ లో పెట్టకుండా ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టేసే ధోరణి సోషల్ మీడియాలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అన్నింటికి మించిన మహిళల విషయంలో కొందరు పెడుతున్న పోస్టులు వారిని తీవ్ర మనో వ్యధకు గురి చేస్తున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఏపీలో దిశా చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లు.. ఇప్పుడు కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తోంది.
ఒకసారి కేంద్రం నుంచి ఆమోదం పొందిన తర్వాత ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంలో కీలకమైన సోషల్ మీడియా పోస్టులపైనా చర్యలు తీసుకునే అంశంపై తాజాగా ఏపీ హోంమంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ చట్టం ఏపీలో అమల్లోకి రానప్పటికీ.. దానికి సంబంధించిన నిఘా మొదలైనట్లేనని పేర్కొన్నారు. ఏపీలో సోషల్ మీడియా మీద నిఘా ఉందని.. ప్రతి జిల్లాలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు.. అసభ్యకర పోస్టులు పెడితే.. సోషల్ మీడియా మానిటర్ సెల్ వాటిని పరిశీలించి.. ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? దాని వెనుకున్న ఉద్దేశం ఏమిటి? ఆ పోస్టు కారణంగా తలెత్తే సమస్యలు ఏమిటి? లాంటి అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని నివేదిక సిద్ధం చేస్తామన్నారు.
ఒకసారి దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత.. ఈ నివేదికల ఆధారంగా కేసులు పెట్టటం జరుగుతుందని చెప్పారు. అందుకే.. పోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారు జాగ్రత్తగా పెట్టాలని.. లేదంటే అనవసరమైన చిక్కుల్లో పడటం ఖాయమని తేల్చారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెట్టే వారి విషయంలో రాజీ పడేది లేదని.. తప్పులు చేసిన వారిపై కఠిన శిక్షలు తప్పవని మరోసారి స్పష్టం చేశారో. సో.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఏపీ ప్రజలు జాగ్రత్తగా పెట్టాల్సిందే. లేదంటే.. సమస్యల్లో చిక్కుకోవటం ఖాయం.